తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని.. కృష్ణా, గోదావరి నదులు జలకళతో ఉప్పొంగి.. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాలని.. రైతుల పంటలు పచ్చని పరులతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ముగిసింది.
నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది తీరంలో సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మహా వరుణ యాగం.. రోజంతా వేద క్రతువులు, ప్రత్యేక పూజలు, హోమాలతో కొనసాగింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా రెడ్డి సాయంత్రం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మహా వరుణ యాగాన్ని నిర్వహించిన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యాగశాలలో 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహించారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేద మంత్రాలతో చతుర్వేద పారాయణం చేపట్టారు. అనంతరం వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని.. రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడకుండా కృష్ణా, గోదావరి నదులు జలకళతో అలరాడాలని.. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండాలని రుత్వికులు సంకల్పించారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయ సీజన్ సాఫీగా సాగాలని, రైతులకు సాగునీటి కొరత లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూర్ణాహుతి సమయంలో యాగశాల వేద మంత్రాలతో మార్మోగింది. తెలంగాణ ప్రజలు, రైతుల సుభిక్షం కోసం చివరి ఆహుతులను సమర్పిస్తూ యాగాన్ని శాస్త్రోక్తంగా ముగించారు.
మరోవైపు పూర్ణాహుతి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కృష్ణానది తీరాన్ని సందర్శించారు. నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిమట్టం, ఇన్‌ఫ్లోలు, నీటి నిల్వ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులు భక్తి, విశ్వాసంతో, చిత్తశుద్ధితో చేపట్టే కార్యానికి తప్పక ఉంటాయని తెలిపారు.
ప్రజలంతా శాంతి, సుఖసంతోషాలతో జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.. తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక మహా వరుణ యాగం జరిగిన నాగార్జునసాగర్ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. సుమారు 1800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోనే ప్రాచీన విజయపురి ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లింది.
బౌద్ధమతానికి ప్రముఖ కేంద్రంగా ఉన్న ఈ నేలపై వేద సంప్రదాయాలు, యజ్ఞయాగాలకు కూడా రాజాదరణ లభించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి చారిత్రక కృష్ణాతీరంలో 108 మంది రుత్వికుల వేదఘోషల మధ్య వరుణ యాగం నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మరోవైపు గత ప్రభుత్వం కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగాలు చేసింది.
అందులో లోక కళ్యాణం, రాష్ట్ర సమృద్ధి కోసం అత్యంత వైభవంగా అయుత చండీ యాగం.. 2015 డిసెంబరులో.. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండాలని సహస్ర మహా చండీ యాగం.. 2019 జనవరిన.. అలాగే 2023 నవంబరులో ప్రజా సంక్షేమాన్ని కోరుతూ 'రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం.. 2024 సెప్టెంబరున నవగ్రహ యాగం వేద పండితుల ఆశీస్సులతో, శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.












