జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలపై అక్కడి విద్యార్థులు, అభ్యర్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ నియామకాలు రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చేపట్టిన నిరసనప్రదర్శనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల కిందట జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది.
పలు విద్యార్థి సంఘాల నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు పోలీసు బారికేడ్లను తొసుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉదయం రాంచీకి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం విని, తగిన సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడికి యత్నించారు.
విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నాయకులు కూడా నిరసన చేపట్టడంతో రాంచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం ఇంటి ఎదుట ఏర్పాటు బారికేడ్లను తోసుకుంటూ విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు యత్నించారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంపూర్ణ ప్రక్షాళనతో పాటు పేపర్ లీక్‌పై సీబీఐ లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని విద్యార్థులు పట్టుబట్టారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చకముందే పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
మరోసారి అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వగా శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.రాంచీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ముందస్తుగా రాంచీలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో 16 రోజులుగా జరిగిన 6 విడతల చర్చలు విఫలమయ్యాయి.కాగా, 98 శాతం డిమాండ్లకు ఓకే చెప్పామని ప్రభుత్వం చెబుతున్నా.. తాము కోరిన 13 పరీక్షల్లో మూడింటిని మాత్రమే రద్దు చేయడానికి అంగీకరించారని విద్యార్థులు వెల్లడించారు.












