ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'జెన్-జీ' (Gen-Z) లేదా 30 ఏళ్లలోపు యువతకు అత్యంత ప్రియమైన నగరంగా జపాన్ రాజధాని టోక్యో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'టైమ్ అవుట్' ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న వేలాది మంది యువతీయువకుల అభిప్రాయాలను సేకరించి 'బెస్ట్ సిటీస్ ఫర్ జెన్-జీ 2026' జాబితాను విడుదల చేసింది. గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, ఈ ఏడాది ఏకంగా పదో స్థానానికి పడిపోవడం విశేషం.
ఆధునిక సాంకేతికత, అద్భుతమైన ప్రజారవాణా వ్యవస్థ, సురక్షితమైన రాత్రి జీవనం (నైట్‌లైఫ్), పాప్ కల్చర్, రోజూ పొందే వినూత్న అనుభవాలు టోక్యోను యువతకు నంబర్ వన్ ఛాయిస్‌గా మార్చాయని సర్వే వెల్లడించింది. టోక్యోలోని రోజువారీ జీవితం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్క జెన్-జీ అభ్యర్థి తెలపగా, 89శాతం మంది అక్కడ లభించే వినోదాలు, కేఫ్‌లు, యానిమే, గేమింగ్, నైట్‌లైఫ్‌కు అత్యధిక రేటింగ్ ఇచ్చారు.
ఈ అంతర్జాతీయ జాబితాలో పోర్చుగల్ దేశానికి చెందిన చారిత్రక నగరం 'పోర్టో' రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్కడి ప్రశాంత వాతావరణం, తక్కువ ఖర్చుతో కూడిన జీవనం మరియు బలమైన సామాజిక సంబంధాలు (కమ్యూనిటీ ఫీల్) యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తదుపరి స్థానాల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మూడో స్థానంలో, బ్రిటన్‌కు చెందిన ఎడిన్‌బరో నాలుగో స్థానంలో, అలాగే చైనాలోని షాంఘై ఐదో స్థానంలో నిలిచాయి.
యువత కేవలం వినోదం, నైట్‌లైఫ్‌కే పరిమితం కాకుండా నివసించేందుకు అనువైన సౌకర్యాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్, కల్చరల్ ఈవెంట్స్, ఉచిత మ్యూజియం ప్రవేశాలు, కొత్త స్నేహితులను చేసుకునే అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక న్యూయార్క్, కోపెన్‌హాగన్, బెర్లిన్, వాలెన్సియా, సియోల్, పారిస్, కేప్‌టౌన్ వంటి ప్రముఖ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.












