ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మరొక క్యాబ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురైనప్పటికీ, తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం ఒలింపియా టెక్ పార్క్ వద్దకు చేరుకోగానే, పక్క రోడ్డు నుంచి ఒక క్యాబ్ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి ప్రవేశించింది. ఈ క్రమంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో అమీన్ కారు, సదరు క్యాబ్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో అమీన్, ఆయన స్నేహితుడితో పాటు క్యాబ్‌లో ఉన్న ప్రయాణికుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించిన అనంతరం ముగ్గురినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ ప్రాణపాయం లేకపోవడం ఊరటనిచ్చే అంశం కాగా, ప్రమాద ధాటికి రెండు వాహనాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
ఘటనపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ (TIW) పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో వాహనాలు అతివేగంతో ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటన నిజమైన కారణాలను వెలికితీసేందుకు ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. కాగా, తండ్రి ఏఆర్ రెహమాన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఏఆర్ అమీన్ ఇప్పటికే ప్లేబ్యాక్ సింగర్‌గా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హిట్ పాటలు పాడి సంగీతాభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.












