వ్యాపారం

పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్‌లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

భారతీయ వినియోగదారులకు రాబోయే రోజుల్లో మరోసారి ద్రవ్యోల్బణం వేడి తగలనుంది. రోజువారీ జీవితంలో వినియోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రముఖ తయారీ సంస్థలు వేగంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్దంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

భారతీయ వినియోగదారులకు రాబోయే రోజుల్లో మరోసారి ద్రవ్యోల్బణం వేడి తగలనుంది. రోజువారీ జీవితంలో వినియోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రముఖ తయారీ సంస్థలు వేగంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్దంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు గాను సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ధరల సవరణ తప్పదని దిగ్గజ కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి.

ఇప్పటికే జూన్ త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెరిగినప్పటికీ, ముడిసరుకుల భారం పూర్తిస్థాయిలో తగ్గిపోలేదని సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నేరుగా ధర పెంపు కనిపించకుండా 'ష్రింక్‌ఫ్లేషన్' వ్యూహాన్ని అమలు చేయాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి. అంటే ఉత్పత్తుల ఎమ్మార్పీ (MRP) ధరలను అలాగే ఉంచి, ప్యాకెట్ లోపల ఉండే సరుకు పరిమాణాన్ని (గ్రాములను) తగ్గించనున్నారు. ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా తమ రూ.5, రూ.10 ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించేందుకు సిద్ధమవుతుండగా, హిందూస్థాన్ యూనిలీవర్ (HUL), డాబర్, గోద్రెజ్, టాటా కన్స్యూమర్ వంటి ఇతర సంస్థలు కూడా ధరలను పెంచడం లేదా ప్యాకెట్ సైజులు కుదించడం ఖాయమని స్పష్టం చేశాయి.

ఒకవైపు నిత్యావసర ఉత్పత్తుల వ్యయం పెరిగి సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతుంటే, మరోవైపు దేశంలో ప్రీమియం మద్యం విక్రయాలు ఊహించని రీతిలో రికార్డు స్థాయికి చేరడం విశేషం. యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి కంపెనీలు జూన్ త్రైమాసికంలో తమ ఖరీదైన పోర్ట్‌ఫోలియో అమ్మకాలలో రెండంకెల భారీ వృద్ధిని నమోదు చేశాయి. రాడికో ఖైతాన్ ప్రీమియం బ్రాండ్ల విక్రయాలు ఏకంగా 35.8 శాతం పెరగడంతో కంపెనీ నికర లాభం 76 శాతానికి పైగా పుంజుకుంది.

సాధారణ బ్రాండ్ల మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టి, కేవలం ప్రీమియం మద్యం అమ్మకాలే గణనీయంగా పెరగడం వినియోగదారుల కొనుగోలు విధానంలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. యునైటెడ్ స్పిరిట్స్ సైతం 51.6 శాతం నికర లాభాన్ని సాధించడానికి ఈ ప్రీమియం బ్రాండ్ల డిమాండే కారణమైంది. ఈ రకంగా ఒకవైపు నిత్య జీవితంలో ఉపయోగపడే బిస్కెట్లు, సబ్బుల లాంటి ప్రాథమిక వస్తువులు 'ష్రింక్‌ఫ్లేషన్' కారణంగా కరిగిపోతుంటే, మరోవైపు ఖరీదైన మద్యం అమ్మకాలు మాత్రం మార్కెట్‌లో ఆశ్చర్యకరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి.

 

#BanglesFestival#FMCGPriceHike#Shrinkflation#IndianEconomy#PriceHike2026#BusinessNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి