హైదరాబాద్ మహానగరంలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ప్రైవేటు విద్యాసంస్థ అయిన శ్రీచైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చిత్రహింసలు చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.అయితే, సీనియర్ విద్యార్థులు అతన్ని దారుణంగా కొట్టినట్టు తెలిసింది. కర్రలతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని తెలిసింది. రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌ను సీనియర్ విద్యార్థులు 12 మంది కర్రలు,ప్లేట్లతో తీవ్రంగా దాడి చేయడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే, తీవ్రంగా గాయపడిన తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ స్కూల్ యాజమాన్యం తమకు ఫోన్ చేసి చెప్పారని, వెంటనే వెళ్లి తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చామని బాలుడి తల్లిదండ్రులు వెల్లడించారు.ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
https://x.com/TeluguScribe/status/2086683747215454461?s=20
తమ కొడుకు మీద దాడికి పాల్పడిన వారి మీద, ఘటన బయటకు రాకుండా దాచిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బాలుడిని కొట్టిన తీరు, అతని ఒంటి మీద చర్మం కమిలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.












