మొబైల్ యూజర్లు ఎవరైతే హోటల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత ఇంటర్ నెట్ (వైఫై) వినియోగించేవారికి మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరికలు జారీచేసింది.ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు దాడులు చేస్తున్నారని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్, హోటల్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న ఈ దాడులను 'క్యాప్టివ్‌క్రంచ్'గా అభివర్ణించింది. దీని వెనుక రష్యాకు చెందిన ఓ ముఠా హస్తం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం హెచ్చరించింది. హ్యాకింగ్ గ్రూప్ 'మిడ్‌నైట్ బ్లిజార్డ్'గా ముఠాగా అనుమానం వ్యక్తం చేసింది.
సదరు ముఠా చేసే సైబర్ దాడులు అత్యంత కఠినంగా ఉంటాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. హోటల్స్, ఎయిర్‌పోర్టులు, కాన్ఫరెన్స్ రూమ్స్‌లో ఉచిత ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన వెంటనే కొన్ని టూల్స్ ఉపయోగించి డివైజ్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని, మాల్వేర్‌ను మొబైల్స్, లాప్ ట్యాప్‌లోకి చొప్పించి యూజర్ స్క్రీన్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో కాల్స్ వినడం, స్క్రీన్‌షాట్లు తీయడం వంటివి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
దీనికి తోడు మొబైల్‌లో యూజర్ టైప్ చేసే ప్రతి అక్షరాన్ని, బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ వివరాలను హ్యాకర్లు రికార్డ్ చేస్తున్నట్టు మైక్రోసాప్ట్ థ్రెట్ గుర్తించింది.ఆ తర్వాత బ్రౌజర్ అప్‌డేట్ చేయాలని, విండోస్ సెక్యూరిటీ స్కాన్ చేయాలని, గూగుల్ సెక్యూరిటీ చెక్ పూర్తయ్యిందని పేర్కొంటూ నకిలీ పాప్-అప్‌లను పంపిస్తారని..హానికర సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నట్టు గుర్తించింది.
ఒక్కసారి ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తే యూజర్ డివైజ్ మొత్తం వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుందని..ఫలితంగా హ్యాకర్లు కీబోర్డ్ టైపింగ్ రికార్డ్ చేయడం,పాస్‌వర్డ్‌లు, బ్రౌజర్ కుకీలను దొంగిలించి ప్రైవేట్ వివరాలు సేకరించి బ్లాక్ మెయిల్,డబ్బులు దొంగిలించడం వంటివి చేస్తారని హెచ్చరించింది.అందుకే హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లోని ఉచిత వైఫైను ఉపయోగించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












