రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ తీరంలో అత్యంత వైభవంగా వరుణయాగాన్ని చేపట్టింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని విజయ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే ఆది పూజలతో ఈ మహా క్రతువు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌లినో ప్రభావం వల్ల సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు రెండో వారం దాటుతున్నప్పటికీ నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో సాగు, తాగునీటి అవసరాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ప్రాజెక్టులో కనీస నీటి నిల్వలు కూడా నమోదు కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో మానవ ప్రయత్నానికి దైవకృప తోడైతే ఫలితం ఉంటుందన్న వేద పండితుల సూచనల మేరకు ప్రభుత్వం ఈ యాగాన్ని తలపెట్టింది.
ఈ యాగం ద్వారా కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదుల్లో ప్రవాహాలు పెరిగి జలాశయాలు నిండాలని యంత్రాంగం ఆశిస్తోంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ వైదిక కార్యక్రమాలు సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని వేద పండితులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ మహా క్రతువు ముగింపు ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం నాగార్జునసాగర్ చేరుకోనున్న సీఎం, సాయంత్రం 3:20 గంటలకు జరిగే పూర్ణాహుతి హోమంలో పాల్గొని వరుణదేవుడికి ప్రత్యేక పూజలు అర్పిస్తారు. సీఎం రాక సందర్భంగా అధికారులు విజయ విహార్ ప్రాంగణంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.












