తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆధార్ ఆధారిత నిధుల బదిలీ విధానం విజయవంతంగా కొనసాగుతూ.. ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ విధానానికి గత సంవత్సరం ఆషాడ మాస బోనాల సమయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా ఈ సంవత్సర కాలంలో రూ. 6,800 కోట్ల మేర ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని.. దాదాపు రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ విధానం ప్రారంభం అయిన మొదట్లో లబ్ధిదారులు దరఖాస్తులతో పాటు సమర్పించిన సాధారణ బ్యాంక్ ఖాతాలకే అధికారులు నిధులను జమ చేసేవారు. కానీ ఆ ఖాతాల్లో చాలామంది ఖాతాలు పనిచేయకపోవడం.. లేదా మినిమం బ్యాలెన్స్ లేదనే సాకుతో బ్యాంకులు ఇందిరమ్మ డబ్బులను కట్ చేయడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని. అదీగాక పాత అప్పులు, వడ్డీల కింద బ్యాంకులు డబ్బులు జమ చేసుకుంటున్నాయనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
ఈ విషయాన్ని పలువురు లబ్ధిదారులు అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి.. ఫిర్యాదు కూడా చేయడంతో.. సమస్యను సకాలంలో గుర్తించిన హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై, ఆయా ఖాతాల్లోని నిధులను హోల్డ్ చేయాలని సంబంధిత బ్యాంకులకు లేఖలు రాశారు. తర్వాత పాత విధానానికి స్వస్తి పలికిన అధికారులు.. కేవలం ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలు లేదా పోస్టల్ అకౌంట్ల ద్వారా మాత్రమే ప్రభుత్వ సాయాన్ని బదిలీ చేసేలా కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు.
మరోవైపు, ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి అనధికారిక కోతలు లేకుండా పూర్తి ఆర్థిక సహాయం నేరుగా జమ అవుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులకు నిధులపై భరోసా పెరిగిందని, ఈ నిర్ణయం పై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.












