తెలంగాణ

Telangana: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దం.. రేపటి నుంచే మొదలవనున్న సమరం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన భూ సమస్యలు కూడా ఈ సమావేశాల్లో కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్యూర్, ల్యాండ్ పూలింగ్, 22ఏ భూములు, భూసేకరణ అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలే అవకాశముంది.

తెలంగాణలో పొలిటికల్ వార్ కు రంగం సిద్దం అయ్యింది. అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి అసెంబ్లీ వేదిక కాబోతోంది.. ఇప్పటికే కీలక అంశాలు తెరపై ఉండటంతో.. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని స్పీకర్ కోరారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా 21 ఏళ్లకే యువతకు చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన అసెంబ్లీలో చర్చకు రానుంది.

ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(బి), 173(బి) ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తున్నాయి.. అయితే తెలంగాణ అసెంబ్లీ 21 ఏళ్లకు పోటీ చేసే అవకాశం కల్పించాలని తీర్మానం చేసినా.. అది వెంటనే చట్టంగా మారదు. దీనికి కేంద్రం, పార్లమెంట్ స్థాయిలో రాజ్యాంగ సవరణ అవసరం. అందుకే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి సిఫార్సుగా వెళ్లనుంది.

మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన భూ సమస్యలు కూడా ఈ సమావేశాల్లో కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్యూర్, ల్యాండ్ పూలింగ్, 22ఏ భూములు, భూసేకరణ అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలే అవకాశముంది. ముఖ్యంగా 22ఏ భూముల వ్యవహారం అసెంబ్లీలో ఎంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

అదే సమయంలో ఆస్తిపన్ను విధానం, హైడ్రా పాత్ర, సాగునీటి ప్రాజెక్టులు, భూవివాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలు, మరోవైపు ప్రతిపక్షాల ప్రశ్నలు.. మధ్యలో ప్రజా సమస్యలతో అసెంబ్లీ హోరెత్తేలా కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు.. కేవలం చర్చలకే పరిమితమవుతాయా..? లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీస్తాయా..? అనేది చూడాలి..

#telangana#assembly#monsoon session#tomorrow#Gutta Sukhender Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి