కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతోందన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.
‘సీఎం రేవంత్ రెడ్డి.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్ మాత్రం కాలేజీ గడప దాటడం లేదు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను, నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద మీకున్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు? బాధిత విద్యార్థులు నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా... మీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎంతో కష్టపడి చదివి, కార్పొరేట్ కంపెనీల్లో 6, 7 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించినా.. ఆ ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని సర్టిఫికెట్ల కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితికి ఈ పిల్లలను తీసుకొచ్చారు.సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాల్లో చేరలేక, ఇటు పైచదువులకు, విదేశాలకు వెళ్లలేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతోంది. పోనీ, ఆ ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు చూపించి కొంత సమయం అడగడానికి.. కనీసం ఆ సర్టిఫికెట్ల 'సాఫ్ట్ కాపీ'లు ఇమ్మని బతిమిలాడినా కాలేజీలు కనికరించడం లేదు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ పిల్లలు ఎందుకు బలి కావాలి?’ అని ప్రశ్నించారు.
పేరెంట్స్ ఆందోళన..
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని, ఓ మంచి ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకున్న ఆ పేద విద్యార్థుల కలలను కల్లలు చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను చదివించిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఇవాళ మీ నిర్వాకం వల్ల ఆవిరైపోతున్నాయి. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని.. పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్న ఒకే ఒక్క సదుద్దేశంతో కేసీఆర్ ఏనాడూ ఆపలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 20,576 కోట్లను విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలబడ్డారన్నారు. కానీ, అదే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మాత్రం.. ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేయాలని చూస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులపై ఎందుకంత కక్ష?
తెలంగాణ జాతి సంపదను, ఆస్తులను ఇష్టారాజ్యంగా తెగనమ్ముకుంటున్న మీకు..రూ. లక్షల కోట్ల టెండర్లు పిలుస్తూ, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు రాత్రికి రాత్రే వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న మీకు... ఈ పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి మాత్రం మనసు రావడం లేదా? అని నిలదీశారు. మీ దగ్గర డబ్బులు లేక కాదు. దళిత, బహుజన, పేద పిల్లలు చదువుకుని పైకి రావడం మీకు ఇష్టం లేకనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని ఆరోపించారు.
ఒకప్పుడు ఇదే ఇంజినీరింగ్ విద్యార్థులను చూసి క్రిమినల్ వేస్ట్, వీళ్లకు కనీసం అప్లికేషన్ నింపడం కూడా రాదు అని అత్యంత అహంకారంతో అవమానించారు. కానీ ఇవాళ అదే విద్యార్థులు తమ కష్టంతో, ప్రతిభతో ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అత్యుత్తమ ప్యాకేజీలు సాధించారు. వాళ్ల ప్రతిభ ఏంటో ఇప్పటికైనా గుర్తించి మీ అవివేకపు మనస్తత్వాన్ని మార్చుకోండని హితవు పలికారు. విద్యార్థులకు వచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్లు, పై చదువుల అడ్మిషన్ లెటర్లను జత చేస్తున్నాను.ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు పోస్టు చేశారు.
విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి తెలంగాణ భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని గుర్తుపెట్టుకోవాలని, ఇకనైనా మీ మొండి వైఖరి విడనాడి, రోడ్డున పడ్డ పిల్లల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి, సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.









