మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత రెండున్నరేండ్లలో ఆయన కేవలం రెండు మూడు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని ..ప్రజాసమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆయన సభకు రాకుండా తన వాళ్లను సభకు పంపించి గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహాధర్నా'లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని నిరసిస్తూ ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు,మంత్రులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..బీఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించడం కాదని, సభకు వస్తే సమాధానం చెబుతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోకుంటే మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్ల మీదనే ఉంటారని జోస్యం చెప్పారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సభకు వచ్చి వారి అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. విపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ జవాబుదారీతనంతో పనిచేస్తోందని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచిత ప్రయాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పేదలకు రేషన్ కార్డు ఇవ్వని దౌర్భాగ్య పాలన పదేళ్ల పాటు సాగిందని, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న అంశాలు, సంక్షేమం గత పదేళ్లలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో రేషన్ కార్డులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు రేషన్ కార్డు రాలేదా? సన్న బియ్యం తీసుకోవట్లేదా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు యువతను రెచ్చగొడుతోందని మండిపడ్డారు.కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రాజీనామా చేస్తారా? డిసైడ్ చేసుకోవాలని అన్నారు.










