తెలంగాణ

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌ల కొనుగోలు.. తెరపైకి సాంకేతిక సమస్య!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటి ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అమలు చేసే సమయంలో ఒక సంక్లిష్టమైన సాంకేతిక సవాలు వెలుగులోకి వచ్చింది. కొత్తగా కొనుగోలు చేయనున్న అత్యాధునిక కోచ్‌లను ప్రస్తుత పాత సిగ్నలింగ్ వ్యవస్థతో అనుసంధానించాలా లేక మెట్రోలోని మొత్తం సిగ్నలింగ్ టెక్నాలజీనే అప్‌గ్రేడ్ చేయాలా అనే దానిపై అధికారులు తీవ్ర ఊగిసలాటలో పడ్డారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 57రైలు సెట్లు అందుబాటులో ఉండగా, ఒక్కో రైలులో కేవలం మూడు కోచ్‌లు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన కిక్కిరిసిన ప్రయాణాల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యాన్ని తగ్గించేందుకు 60 కొత్త కోచ్‌లను (10 కొత్త మూడు కోచ్‌ల ట్రైన్ సెట్లు) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ దాదాపు 12 ఏళ్ల క్రితం నాటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన పాత మెట్రో సిస్టమ్‌లోకి, నేటి నూతన డిజిటల్ కోచ్‌లను అనుసంధానించడం సాంకేతికంగా పెద్ద చిక్కుముడిగా మారింది.

హైదరాబాద్ మెట్రో మొదటి దశలో ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP), ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO), మరియు కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) సిస్టమ్‌లు నాటి సాంకేతికతకు లోబడి ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నిపుణులు, మెట్రో అధికారులతో ఈ సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. పాత సాంకేతికతకు తగినట్లుగా కొత్త కోచ్‌లను ప్రత్యేకంగా తయారు చేయించడం కన్నా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం సిగ్నలింగ్, కంట్రోల్ వ్యవస్థనే పూర్తిగా ఆధునికీకరించడం అత్యంత శ్రేయస్కరమని డీఎంఆర్‌సీ ఇంజనీర్లు స్పష్టమైన సిఫార్సు చేశారు.

ఈ సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల కొత్త, పాత కోచ్‌ల మధ్య సాంకేతిక సర్దుబాటు సులభతరం కావడమే కాకుండా, రైళ్ల సమయపాలన, భద్రత, వేగం, నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిచే ఈ అప్‌గ్రేడ్ విధానంపైనే మొగ్గు చూపుతూ, వీలైనంత త్వరగా స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

#HyderabadMetro#MetroCoaches#DMRC#TelanganaTransport#HyderabadNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి