తెలంగాణ

Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, ఆధునిక పరిపాలనా విధానాలపై శిక్షణ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని శ్రీధర్ బాబును కోరారు. అదేవిధంగా తెలంగాణలోని ప్రముఖ విద్యా, శిక్షణా సంస్థలతో భాగస్వామ్యానికి మారిషస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లచ్మునా రాజ్ పెంటియా శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, మారిషస్ మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీ జరిగింది.

ప్రత్యేకంగా పాలన, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఈ సందర్భంగా మారిషస్ మంత్రి లచ్మునా రాజ్ పెంటియా కీలక వ్యాఖ్యలు చేశారు. మారిషస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అత్యంత నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోందని తెలిపారు.

అందుకే మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, ఆధునిక పరిపాలనా విధానాలపై శిక్షణ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని శ్రీధర్ బాబును కోరారు. అదేవిధంగా తెలంగాణలోని ప్రముఖ విద్యా, శిక్షణా సంస్థలతో భాగస్వామ్యానికి మారిషస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మారిషస్‌కు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కు మారిషస్ మంత్రిని హాజరు కావాల్సిందిగా ఆహ్వానించిన ఆయన..

మారిషస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగు భాష, విద్య, పరిశోధన, కళల రంగాల్లో సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు..

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మారిషస్ పబ్లిక్ సర్వీస్ సెక్రటరీ దేవేంద్ర గోపాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ బోర్డ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ నికోలస్ రాగోడూ, ఏఐపీఎస్ఐ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ దుర్బరీతో పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటీఈఅండ్‌సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితర అధికారులు పాల్గొన్నారు.

#Telangana#Duddilla Sridhar Babu#Mauritius#Minister Lachmuna Raj Pentia#iscussions#issues
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి