తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని.. అనర్హులైన వారు ఓటర్ల జాబితాలో చేరకూడదని స్పష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు.. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న గడువును పొడిగించాలని.. ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.
జూన్ 10 నాటికి తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 73 లక్షల 39 వేల మందిని గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన లేదా ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా ASDD కేటగిరీలో గుర్తించినట్లు సీఎం తెలిపారు. ఇందులో దాదాపు 62 శాతం మంది.. అంటే 45 లక్షల 19 వేల మందిని నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమన్నారు.
అదే సమయంలో డిజిటలైజ్ చేసిన 2 కోట్ల 65 లక్షల గణన పత్రాల్లో 60 లక్షల 50 వేల పత్రాల్లో లోపాలు ఉండగా.. మరో 32 లక్షల 36 వేల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం కాలేదని తెలిపారు. దీంతో దాదాపు 92 లక్షల 86 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని పేర్కొన్నారు.
తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణించడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు సహాయం చేయకుండానే పాత ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించవద్దని కోరారు. ఓటు తొలగించే ముందు అధికారిక నోటీసు, విచారణ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా తీసివేయాల్సిన 58.6 శాతం ఓటర్లలో ఏకంగా 41.9శాతం మంది ఒక్క హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. వీరి ఓట్లు తొలగిస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఎలాంటి ఎన్నికలు లేనందున.. SIR ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని గుర్తు చేశారు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని.. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించే తేదీని కూడా తదనుగుణంగా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘంకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి.. కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని సూచించారు.
రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు నోటీసులు అందుకున్న తర్వాత పత్రాలు సమర్పించేందుకు వారం రోజులు సరిపోవని.. కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్రాల స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి.. అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సీఎం సూచించారు.
GO నంబర్ 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని.. అందుకే కొంతమంది అధికారులతో మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహించడం సాధ్యం కాదన్నారు. అదనపు అధికారులను నియమించి.. ముద్రిత నోటీసుల్లోనే విచారణ తేదీ, సమయాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
మొత్తంగా SIR ప్రక్రియలో అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు అవసరమైన పరిపాలనా, ఇతర సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు..












