Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అంటే భయం లేదా? అని సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ అంటే లెక్క లేకుండా పోయిందని అధికారులపై గుస్సా అయ్యారు.
నేను వచ్చేవరకు ఎందుకు ఆగలేదు?
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కుమురంభీం ఆదివాసీ భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను కార్యక్రమానికి వచ్చేలోపే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంపై ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి చూడకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని దానం నాగేందర్ అధికారులను నిలదీశారు.
ఆ అధికారులను వదిలేది లేదు
ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులను వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకునేలా ఎంత దూరమైనా వెళ్తానని దానం హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాకుంటే తన దగ్గరికి రావాలన్న దానం.. అధికారుల గల్లా పట్టుకుని నిలదీద్దామన్నారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం రేవంత్ చెప్పినా అధికారుల తీరులో మార్పు లేదని, ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని దానం ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని వదిలేది లేదన్న దానం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ముఖ్యమంత్రే చెప్పినా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదు
''ఎమ్మెల్యే అంటే భయం లేకుండా పోయింది. ప్రోటోకాల్ అంటే లెక్క లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్లు రాని అర్హులైన పేదలు నా దగ్గరికి రండి. గల్లా పట్టుకుని అధికారులను నిలదీస్తా. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు మర్యాద ఇవ్వాలని. కానీ ఎమ్మెల్యేలకు మర్యాద లేకుండా పోయింది. వాళ్లంతట వాళ్లే డ్రా తీసుకుంటే ఎమ్మెల్యే వచ్చి లాభం ఏముంది? అధికారులే ఆఫీసులో కూర్చుని లక్కీ డ్రా తీసేస్తే అయిపోతుంది కదా. ఎమ్మెల్యేలకు ఆఫీసర్లు కాకపోతే ఎవరిస్తారు గౌరవం? నేను దీన్ని తప్పకుండా సీరియస్ గా తీసుకుంటాను. దీని మీద ఎంత దూరమైనా పోతాను'' అని దానం నాగేందర్ అన్నారు.












