కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయన పలు తీవ్రమైన ప్రశ్నలను సంధించారు. కుటుంబ సభ్యుల భద్రత, కాంగ్రెస్ నేతల వీఐపీ సంస్కృతి, ఓఎస్డీ సుమంత్ కేసు విషయంలో విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు ఏ ప్రాతిపదికన 2+2 సెక్యూరిటీ గన్‌మెన్‌లను కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులకు భద్రతగా ఉన్న గన్‌మెన్లను తొలగిస్తూ, మరోవైపు ఎలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో లేని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, వివాదాస్పద కేసుల్లో ప్రభుత్వం వహిస్తున్న తీరును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వ్యవహారంలో బండి భగీరథ్‌ను దాచిపెట్టింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దాడి, వసూళ్ల కేసులో నిందితుడిగా ఉండి ఇప్పటికీ అరెస్ట్ కాకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. సుమంత్ ఎక్కడున్నాడనే విషయం ముఖ్యమంత్రికే స్పష్టంగా తెలుసని, అయితే ఈ వ్యవహారాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారని ఆయన విమర్శించారు.
అధికారులు, ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక..
కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ ఆదేశాలకు తలొగ్గి ప్రజలను, ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్న అధికారులకు, యంత్రాంగానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 'బీఆర్ఎస్ 3.0' ప్రభుత్వంలో ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అక్రమ, చట్టవిరుద్ధమైన ఆదేశాలను అమలు చేస్తూ ప్రజలను వేధించిన ప్రతి ఒక్కరిపై ఈ ట్రిబ్యునల్ ద్వారా సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఎస్‌పీ పేర్కొన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. విపక్ష నాయకుల భద్రతను కోత విధిస్తూ స్వపక్ష నేతలకు, కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా సదుపాయాలు కల్పిస్తున్నారనే ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.












