పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు భారత ప్రజల దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతుండగా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మంటలు మధ్యతరగతి బ్రతుకులకు భారంగా మారాయి.. ఫలితంగా సామాన్యుడి జేబుపైనా అదనపు భారం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్.. (ఐజీఎల్) కిలో సీఎన్‌జీపై ఏకంగా 3 రూపాయల 89 పైసలు పెంచింది. ఈ కొత్త ధరలు ఆగస్టు 29 శనివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు 83 రూపాయల 09 పైసలుగా ఉన్న కిలో సీఎన్‌జీ ధర.. ఇప్పుడు 86 రూపాయల 98 పైసలకు చేరింది. ఇక ఢిల్లీలో మాత్రమే కాదు.. నోయిడా, ఘజియాబాద్‌లో సైతం సీఎన్‌జీ ధర కిలో 95 రూపాయల 59 పైసలకు చేరగా.. గురుగ్రామ్‌లో 92 రూపాయల 01 పైసలకు పెరిగింది.
మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్.. అంటే ఎల్‌ఎన్‌జీ ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా, కార్గో రవాణాపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. భారత్‌లో సీఎన్‌జీ కోసం ఉపయోగించే గ్యాస్‌లో కొంత భాగం దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీపై ఆధారపడటం వల్ల.. అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయ ధరలపైనా కూడా పడుతోంది.
ఇక ఐజీఎల్ ప్రకారం అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని పూర్తిగా మోపకుండా ఇప్పటివరకు కొంతమేర నియంత్రించామని సంస్థ చెబుతోంది. అయితే ఇన్‌పుట్ గ్యాస్ ధరల పెరుగుదల గణనీయంగా మారడంతో తాజా ధర సవరణ అనివార్యమైందని వివరణ ఇచ్చింది. ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లకు సీఎన్‌జీ ధర పెరగడం అంటే నేరుగా నిర్వహణ ఖర్చులు పెరగడమే.
ఇంధనం ఖర్చు పెరుగుతున్నా.. ప్రయాణికుల ఛార్జీలు అదే స్థాయిలో ఉంటే.. చివరకు అదనపు భారం తప్పదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. రవాణా ఖర్చులు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి.. కూరగాయలు, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలపైనా సైతం ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో మొదలైన సంక్షోభం.. అంతర్జాతీయ గ్యాస్ ధరలను పెంచి.. దేశీయ సీఎన్‌జీ ధరలను ప్రభావితం చేస్తోంది. అక్కడి ఉద్రిక్తతల ప్రభావం.. ఇక్కడి సామాన్యుడి జీవితానికి భారంగా మారుతుంది.












