అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా చూపిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోపై టెహ్రాన్ మండిపడింది. ట్రంప్ వాస్తవాలను గుర్తించలేని భ్రమల్లో బతుకుతున్నారని, ఆయనకు మానసిక నిపుణుల పర్యవేక్షణలో 24 గంటల చికిత్స అత్యవసరమంటూ ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్ ఘరీబాబాది తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా సైనిక చర్యల భయంతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందని, జలసంధి విషయంలో సైతం తమ ఒత్తిడి పనిచేసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత రాజేశాయి. అమెరికా చర్యలు పూర్తిగా ఏకపక్షమని, తమ భూభాగంపై వాషింగ్టన్ అసంబద్ధమైన దావాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ విదేశాంగ శాఖ, అమెరికా విధిస్తున్న చట్టవిరుద్ధమైన ఆంక్షలను ప్రపంచ దేశాలేవీ గుర్తించవద్దని పిలుపునిచ్చింది.
ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ మానవతా సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఆరోపించింది. వాషింగ్టన్ భయపెట్టే ధోరణులకు తలొగ్గి ఆంక్షలను అమలు చేసే దేశాలు సార్వభౌమత్వ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నట్లేనని హెచ్చరించింది. న్యాయబద్ధమైన అంతర్జాతీయ వాణిజ్యానికి అమెరికా అడ్డంకిగా మారిందని విమర్శిస్తూ, ప్రపంచ దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని ఇరాన్ కోరింది.
ఈ వివాదం అంతర్జాతీయంగా చమురు రవాణా మార్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నిరంతరం పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అణ్వస్త్ర ప్రయోగాలు మరియు ఆర్థిక ఆంక్షల పరంపరపై ఇరు దేశాల ప్రతినిధులు చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.












