తెలంగాణ రాజకీయాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విలేకరులతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లన్నర పూర్తయిన సందర్భంలో, క్యాబినెట్‌లో తక్షణమే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (షఫ్లింగ్) చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ఒక కొత్తదనం, నూతనోత్సాహం వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఏ పార్టీలోనూ సరైన క్రమశిక్షణ కనిపించడం లేదని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపు తగాదాలను వెంటనే అరికట్టాలని సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ లీకేజీలను అదుపు చేయడంతో పాటు, అధిష్ఠానం గీసిన గీత దాటి మాట్లాడే నేతలపై కఠిన చర్యలు లేదా వేటు వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. పార్టీలో లీడర్లు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదని చెబుతూ, నేత చిన్నారెడ్డి ఓపెన్‌గా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. క్రమశిక్షణ, అంతర్గత విభేదాలను కంట్రోల్ చేస్తేనే మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.
ఏటా నాలుగు పంటలకు రైతు భరోసా ఇవ్వాలి
పరిపాలనా విధానాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.2,000 కు పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు, ప్రతీ ఏటా నాలుగు పంటలకు రైతు భరోసా పథకాన్ని విధిగా కొనసాగించాలని కోరారు. సంక్షేమ పథకాల్లో అవసరమైన ఉచితాలను తగ్గించి, కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందేలా చూడాలని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలోనే 22ఎ నిబంధన
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన 22A నిబంధనలను తక్షణమే రద్దు చేయాలన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే బీపీఎల్ (BPL), ఏపీఎల్ (APL) వర్గాల వర్గీకరణపై తాను ఇప్పటికే అనేక సూచనలు చేశానని, కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ సాధన కోసం పోరాడిన అసలైన ఉద్యమకారులకు ఇప్పటికైనా తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సుఖేందర్ రెడ్డి స్వంత ప్రభుత్వంపైనే ఇలా ఓపెన్‌గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












