మరణం ఏక్షణం ఎటువైపు నుండి ముంచుకు వస్తుందో అంచనా వేయడం కష్టం.. కొన్ని సందర్భాలలో ఆనంద సమయాలను సైతం విషాదంగా ముగిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి రావడం తెలిసిందే.. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్న వ్యక్తి అంతలోని తిరిగిరాని లోకాలకు వెళ్ళితే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.. తాజాగా ఇలాంటి సంఘటనే నగరంలో చోటు చేసుకుంది.
కొత్త కారు కొన్న ఆనందంతో పూజ చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని దుర్ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్యతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ క్రమంలో మియాపూర్‌లో నివసించే ఆయన మేనల్లుడు సాయికుమార్ ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు.
వాహనానికి పూజ చేయించేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు ఆనందంగా నిర్వహించుకున్నారు.. అనంతరం కారు కింద నిమ్మకాయలను తొక్కించే క్రమంలో వాహనాన్ని కొద్దిగా ముందుకు కదపాలని పూజారి సూచించినట్లు సమాచారం.
అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును ముందుకు పోనిచ్చే క్రమంలో బ్రేక్‌కు బదులుగా పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు గట్టిగా వేయడంతో కారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఎంతో సంతోషంగా పూజ కోసం వచ్చిన మేనమామ, అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోవడంతో మేనల్లుడు కన్నీరుమున్నీరయ్యాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.. ఇక కారణం ఏమైతేనేమి ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.. ప్రాణాలు పోతే తిరిగిరావు కదా!..












