ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసే వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ఇప్పటికే గుజరాత్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తుండగా, ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం అక్కడ పర్యటించి అధ్యయనం చేసింది. నూతన విధానంలో లబ్ధిదారులకు డిజిటల్ కూపన్లు అందజేస్తారు. కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే, సదరు కోటా విలువను లెక్కించి 'సీబీడీసీ' ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో నగదు రూపంలో జమ చేస్తారు.
ఈ వినూత్న పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నం జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ వచ్చే ఫలితాలు, లబ్ధిదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కొంతమంది మళ్లీ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం లేదా తీసుకోకుండా వదిలేయడంతో ఆ బియ్యం రీ-పాలిష్ అయి కాళాపజార్‌కు తరలిపోతోందనే ఫిర్యాదులపై ఈ నిర్ణయం చెక్ పెట్టనుంది.
త్వరలోనే ఈ నగదు బదిలీ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను పౌరసరఫరాల శాఖ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, బియ్యం అవసరం లేని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించడమే కాకుండా ప్రభుత్వ ఖజానా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. ఈ విధానం బాగుంటంతో తెలంగాణలోనూ ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఈ సరికొత్త నిర్ణయం విజయవంతమైతే తెలంగాణ ప్రభుత్వం యోచించే అవకాశాలు ఉన్నాయి.












