తెలంగాణ

Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం

రచన: NK10 నిమిషాల పఠనం

తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

* కేంద్రం చట్టం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా

* రాష్ట్రంలో కొత్త విత్తన చట్టంపై ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు

* డ్రాఫ్ట్ విత్తన చట్టం-2025పై మంత్రి తుమ్మల సమీక్ష

* రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల ఆధారంగా ఇప్పటికే సమగ్ర చట్టం రూపకల్పన

* కేంద్ర ప్రభుత్వానికి డ్రాఫ్ట్ బిల్లు

* కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టం అమలులో తీవ్ర జాప్యం

* నకిలీ, నాసిరకం విత్తనాలతో నష్టపోయే రైతులకు పరిహారం అందేలా వచ్చే పంట కాలం నుండి చట్టబద్ధమైన వ్యవస్థ

* విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయం, నాణ్యమైన విత్తనాల సరఫరాకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ

Tummala Nageswara Rao: తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన చట్టం-2025పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, విక్రయాలు, ధరల నియంత్రణతో పాటు విత్తన ఉత్పత్తి రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీ రైతులు, విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు, డీలర్లు, పంపిణీదారులు, వ్యవసాయ అధికారులు తదితర వర్గాలతో సంప్రదింపులు నిర్వహించి, విత్తన రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సూచనల మేరకు విత్తన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2025 పేరుతో ముసాయిదా బిల్లును రూపొందించిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ, కొన్ని అంశాలను సమ్మతించడంతో పాటు, మరికొన్ని అంశాలపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని తెలిపారు.

నెలలు గడిచినా కేంద్రం నుంచి ముందడుగు లేదు

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తన అభిప్రాయాలను, సూచనలను పంపి నెలలు గడిచినా విత్తన చట్టం విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విత్తన చట్టాన్ని త్వరగా తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిందని తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం విషయంలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక పంటకాలం గడిచిపోయిందని, రైతుల ప్రయోజనాల కోసం ఇకపై మరింత జాప్యం చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.

వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా చర్యలు

వచ్చే పంట కాలానికైనా విత్తన చట్టం అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనలు, రైతుల ప్రయోజనాలు, విత్తన రంగంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విత్తన చట్టం రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ దేశంలోనే ప్రముఖ విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన నేపథ్యంలో విత్తన రంగానికి సమగ్ర చట్టపరమైన వ్యవస్థ ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ముందుకు

కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి చట్టం తీసుకొచ్చినట్లయితే దానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చర్యలు చేపడతామని, ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి లభించని పక్షంలో కూడా రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విత్తన బిల్లును రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ్యుల ఆమోదంతో రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

విత్తన రైతులకు చట్టపరమైన రక్షణ

విత్తన ఉత్పత్తి రైతులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. రైతు-విత్తన కంపెనీ మధ్య నేరుగా పారదర్శక ఒప్పంద వ్యవస్థ ఉండేలా చూడాలని, మధ్యవర్తుల పాత్రను నియంత్రించాలని సూచించారు. విత్తన ఉత్పత్తికి రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంట బీమా, నాణ్యత లేని విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నకిలీ విత్తనాలపై కఠిన నియంత్రణ

నకిలీ, నాసిరకం, అనధికార విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కఠినమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. విత్తన ఉత్పత్తి ప్రాంతాలను క్రాప్ బుకింగ్, సీడ్ ట్రేసబులిటీ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. మండల స్థాయిలో సీడ్ బ్యాంకులు, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులను ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ, దేశీయ విత్తన రకాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పంట నష్టపోయిన రైతులకు సత్వర పరిహారం

నకిలీ, నాసిరకం లేదా నాణ్యత లేని విత్తనాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సత్వరం పరిహారం అందేలా ప్రత్యేక చట్టబద్ధమైన వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రైతుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సమర్థవంతమైన గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

తెలంగాణ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయం చేయడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, పంట నష్టానికి పరిహారం కల్పించడం, విత్తన ధరలు, మార్కెట్‌ను నియంత్రించడం, విత్తన రంగంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించడం సమగ్ర విత్తన చట్టం ప్రధాన లక్ష్యాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో జాప్యానికి తావు లేకుండా, రాష్ట్ర విత్తన రంగానికి బలమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

#Tummala Nageswara Rao#Telangana#Telangana Seed Draft#Seed Act Draft#Farmers#Swechaa News#Draft Seed Bill 2025
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి