వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు ఏకంగా పార్టీ అధిష్టానం ముందుకు చేరాయి. ఎమ్మెల్యే మెగా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం.. తాజాగా ఫిర్యాదుల దశకు చేరడంతో కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వనపర్తి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మెగా రెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గాల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయన్న చర్చ గత కొంతకాలంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు అంశంపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఆ వ్యాఖ్యలు పార్టీకి, తనకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ మెగా రెడ్డి తీవ్రంగా స్పందించారు.
మంగళవారం పార్టీ నాయకులతో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన మెగా రెడ్డి.. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఇతర పార్టీలతో చిన్నారెడ్డి సంబంధాలు కొనసాగిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలను కూడా ఆయన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
దీనిపై పీసీసీ చీఫ్ సానుకూలంగా స్పందించారు. చిన్నారెడ్డి సీనియర్ నాయకుడని చెబుతూనే.. ఆయన మాట్లాడిన వీడియోలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి నుంచి కూడా వివరణ తీసుకుంటామని, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక్కడితో వ్యవహారం ఆగలేదు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ కూడా ఆరా తీసినట్లు సమాచారం. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోలను విశ్లేషిస్తున్న అధిష్టానం.. నేతల వ్యాఖ్యలపై నివేదిక కోరింది. ఈ నివేదికను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రస్తుతం ఈ వివాదంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చిన్నారెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? లేక ఇరువర్గాలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తుందా? వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన ఈ పంచాయతీకి అధిష్టానం ఎలాంటి ముగింపు ఇస్తుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


