హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీపితో పాటు చేదు లాంటి ఒక వార్త చెప్పింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను తప్పనిసరిగా రీసెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త మార్పు వల్ల మీ నెలవారీ ఈఎంఐ పెరుగుతుందా? లేక తగ్గుతుందా? సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం.
ఆర్బీఐ నూతన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ ఆధారిత హోమ్ లోన్లపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వడ్డీ రేట్లను సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రేట్లను రీసెట్ చేస్తున్నాయి. కొత్త నిబంధనల వల్ల ఆర్‌బీఐ రెపో రేట్ మార్పుల ప్రభావం రుణగ్రహీతలపై చాలా త్వరగా పడుతుంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త రుణాలు అమల్లోకి వస్తాయి.
అలాగే పాత రుణగ్రహీతలకు ఈ నూతన విధానంలోకి మారేందుకు 2029 ఏప్రిల్ 1 వరకు గడువు ఇవ్వబడుతుంది. ఈ నూతన మార్పుల వల్ల హోమ్ లోన్ పొందిన రుణగ్రహీతలకు రెండు రకాల తీవ్రమైన ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంక్ రెపోరేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు ఆ తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడానికి నెలల తరబడి వేచి చూడకుండా కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈఎంఐ లేదా లోన్ కాలపరిమితి తగ్గించాల్సి ఉంటుంది.
అయితే దీనికి విరుద్ధంగా, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచిన సమయాల్లో ఆ అదనపు వడ్డీ భారం కూడా అంతే వేగంగా, నేరుగా రుణగ్రహీతలపై పడుతుంది. దీనివలన కస్టమర్లకు కేవలం వడ్డీ రేట్ల సవరణలో పారదర్శకత లభించడమే కాకుండా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వారి నెలవారీ బడ్జెట్‌లో వేగవంతమైన హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న పాత కస్టమర్లు ఈ ముసాయిదా ప్రతిపాదనల పట్ల తక్షణమే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
మొత్తానికి, ఈ నూతన విధానం వల్ల బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల విధానం మరింత సమర్థవంతంగా మారి వినియోగదారులకు స్పష్టత లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ తీసుకునే ద్రవ్య పరపతి నిర్ణయాల ఫలితాలు కస్టమర్లకు త్వరితగతిన అందడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు కేవలం ముసాయిదా దశలోనే ఉన్నాయి కాబట్టి భాగస్వాములు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరమే ఇవి తుది చట్టంగా మారనున్నాయి. గృహ రుణాలు పొందిన వారు రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిన అవసరముందని స్పష్టమవుతోంది.


