భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతించాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లను ఆగస్టు 29లోగా పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే మహా పంచాయత్ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఖనౌరీ-దాతా సింగ్‌వాలా సరిహద్దు వద్ద రైతులు టెంట్లు ఏర్పాటు చేసుకుని నిరసనలు కొనసాగించారు. కాలినడకన ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించాలని వారు అధికారులను కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, సంయుక్త కిసాన్ మోర్చా కార్యకర్తల కీలక సమావేశంలో రైతు నిరసనల తదుపరి కార్యాచరణ, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశాలపై వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన వైద్యుడు, కాంగ్రెస్ నేత, డాక్టర్ దినేష్ భాయ్ పర్మార్ ది వైర్ వెబ్‌సైట్‌కు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా భారత మార్కెట్‌లోకి అమెరికన్ ఉత్పత్తులు ప్రవేశించి, దేశీయ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని పంజాబ్, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం తమపైనే కాకుండా తమపై ఆధారపడిన శ్రామికులు, దుకాణదారులు, చివరకు వినియోగదారులతో సహా మొత్తం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట ప్రభుత్వం గుజరాత్‌లోని మోర్బీలో వ్యవసాయ భూముల్లో హై వోల్టేజీ విద్యుత్ సరఫరా లైన్లు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. వీటివల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోవడమే కాకుండా పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు మండిపడుతున్నారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ రైతులు సైతం తమ పెసర పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ భోపాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎరువుల కొరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర టేడ్ యూనియన్లు ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక విధానాలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.
తమిళనాడు, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో పలు కార్మిక సంఘాలు ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి. రైతుల ఆదాయాం, వ్యవసాయ భూమి వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం తమ గోడు వినాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు..


