మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి
తెలంగాణ సమాఖ్య డిమాండ్
-రాష్ట్రంలో భూములకు రక్షణ లేకుండా పోయింది
-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పడం కాదు రాజీనామా చేయాలి
-తప్పు చేసిన ఆఫీసర్లందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి
-భూ యజమానులకు ఇచ్చిన 22ఏ నోటీసులు అన్నింటిని వెంటనే రద్దు చేయాలి
-భూ బాధితులు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి బకరాలు కావొద్దు
-పౌర సమాజం మేల్కోవాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
-తెలంగాణ సమాఖ్య సమావేశంలో వక్తలు
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్‌పై నిపుణులు ధ్వజమెత్తారు. చట్టాల మాటున భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలన అంటూనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
వెంటనే 22ఏ నోటీసులను రద్దు చేయాలి
మరోవైపు తెలంగాణ సమాఖ్య 22A పెద్ద కుట్ర అని ఆరోపించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పడం కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తప్పు చేసిన ఆఫీసర్లందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని, భూ యజమానులకు ఇచ్చిన 22ఏ నోటీసులు అన్నింటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. భూ బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి బకరాలు కావొద్దని సూచించింది. పౌర సమాజం మేల్కోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది.
ప్రజలకు భద్రత ఇవ్వని ఇలాంటి ప్రభుత్వం ఎందుకు?తెలంగాణ సమాఖ్య అడ్వైజర్
తెలంగాణలో అనిశ్చితి నెలకొంది. ధరణి, భూ భారతి బాధితుల పక్షాన ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించగానే రెవెన్యూ మంత్రి బయటకు వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకవేళ పౌర సమాజం కనుక మౌనంగా బాధపడి ఉండుంటే మంత్రి బయటకు వచ్చి సారీ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. పౌర సమాజం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై దృష్టి సారించాలి.
ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు
మనం అమాయకంగా ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే. భూమికి భద్రత ఇవ్వలేని ప్రభుత్వాలు మనకు అవసరమా? ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రజాపాలన అని పేరు పెట్టి మీరు ఇచ్చేది మానసిక క్షోభనా? ఒక అభద్రత భావం కల్పిస్తారా? ప్రభుత్వానికి మొత్తం తెలుసు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 12 ఏళ్ల నుంచి ఎమ్మార్వో ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ప్రజలు గడిపారు. ధరణి వల్ల సమస్యలు వచ్చాయని చెబితే కొత్త ప్రభుత్వం వచ్చి భూ భారతి తెచ్చింది. ఒక భూమికి యజమానిని, ఒక ఇంటికి యజమానిని మీరు యజమాని కాదని నోటీసులు ఇస్తే వారి పరిస్థితి ఏంటి?
హైడ్రా, మూసీ, 22ఏ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు
అటు హైడ్రా అని ఇటు మూసీ అని ఇవాళ 22ఏ పేరుతో ప్రజలను పరేషాన్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి ప్రజలకు పరేషాన్ తప్ప ప్రజలకు భద్రత ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వం ఎందుకు? సారీ చెబితే సరిపోతుందా. మర్డర్, రేప్ చేసి సారీ చెబితే సరిపోతుందా. ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? సారీ కాదు రాజీనామా చేయాలి. తప్పు చేసిన ఆ ఆఫీసర్లను తొలగించాలి.
ఇలాంటి తప్పులు మరోసారి రిపీట్ అవకుండా ఉండాలంటే తప్పు చేసిన వారందరిని తొలగించాలి. 22ఏ అనేది ఒక కుట్ర. అది తప్పు కాదు. కావాలనే చేసింది. పౌర సమాజం జాగృతం కావాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 22ఏ నోటీసులన్నీ రద్దు చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బకరాలు కావొద్దు. టోల్ ఫ్రీ నెంబర్ ఒప్పుకోము. ఓనర్ షిప్ కంటిన్యూ కావాలి'' అని తెలంగాణ సమాఖ్య ఆర్గనైజర్ డిమాండ్ చేశారు.
ప్రజలు మేల్కోవాలి-ప్రభుత్వాన్ని నిలదీయాలి
మొన్న ధరణి, నిన్న భూ భారతి, ఇప్పుడు 22ఏ పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోంది. భూములు కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఏకం కావాలి. జెన్ జెడ్, రైతులు, ప్రజలు బయటకు రావాలి. అన్యాయాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, లేదంటే ఈ భూ దందాలు ఆగవు. .
ప్రజల ఇన్వాల్వ్ మెంట్ లేకుండా, ఓనర్లకు తెలియకుండా ఏ రికార్డు మార్చినా అది క్రైమ్ అనే అంశాన్ని చట్టంలో చేరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. సర్వేకి, హక్కులకి లింకు లేకుండా జరగడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూలోని ల్యాండ్ వింగ్, సర్వే వింగ్ ఇవన్నీ కలిపి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒకే గొడుగు కిందకు తేవాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని తమ అభిప్రాయాలను తెలంగాణ సమాఖ్య సమావేశంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు.












