తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతున్న తిరుమలకు.. వీకెండ్ వస్తే చాలు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలో రోజు సుమారుగా 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇక తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మో త్సవాలు, వైకుంఠ ద్వార దర్శన సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది. ఈసారి మాత్రం సాధారణ రోజులోనే భారీగా ఆదాయం రావడం విశేషం. కాగా నిన్న మంగళవారం తిరుమల శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు..
అలాగే స్వామి వారికి 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సుమారుగా 4.16 లక్షల లడ్డూల విక్రయం జరిగినట్టు తెలిపిన టీటీడీ అధికారులు.. స్వామి వారికి హుండీకి రూ.6.12 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.. మరోవైపు ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వ దర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు..


