National

స్కూల్ ఠీక్ కరోతో CJP మరోసారి హాట్ టాపిక్.. నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

రచన: Kashi8 నిమిషాల పఠనం

CJP భవిష్యత్ ప్రణాళికలు చూస్తే కేవలం స్కూళ్లకే పరిమితం కావడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా మరో క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు, వేచి ఉండే సమయం, రోగులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

మ‌రోసారి జ‌నాల్లోకి సీజేపీ

స్కూల్ ఠీక్ క‌రో పేరుతో ఉద్య‌మం

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌రిస్థితుల‌పై పోరాటం

ఒకప్పుడు సోషల్ మీడియాలో సెటైరిక్‌గా మొదలైన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) ఉద్యమం ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నలు సంధించే స్థాయికి చేరుకుంది. NEET పరీక్షల వ్యవహారం, విద్యార్థుల సమస్యలపై ప్రారంభమైన ఉద్యమం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో CJPకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఉద్యమం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు స్కూల్ ఠీక్ క‌రో పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై ఫోకస్ పెట్టింది.

స్కూల్ ఠీక్ క‌రో అంటే ఏంటి?

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక సదుపాయాల కొరతను వెలుగులోకి తీసుకురావడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యంగా CJP చెబుతోంది. సరైన తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు, ఇతర ప్రాథమిక వసతులు ఉన్నాయా? ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? వంటి అంశాలను స్థానికంగా పరిశీలించి, వాటిని వీడియోలు, సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకురావడమే ఈ ఉద్యమంలో ప్రధాన భాగం.

ఆగస్టు 15న ఈ క్యాంపెయిన్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాన్ని CJP ప్రారంభించింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగిన ఘటన ఈ ఉద్యమానికి మరింత ప్రచారం తెచ్చింది.

హింగోలి స్కూల్‌లో ఏం జరిగింది?

హింగోలి జిల్లా లింబాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ మద్యం మత్తులో విధులకు వస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రామస్తులు, CJP కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఆ నిరసనకు ఫలితంగా సంబంధిత ప్రిన్సిపల్ సస్పెండ్ అయినట్లు CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. “స్కూల్‌ను బాగు చేసే వరకు ఆగేది లేదు” అనే సందేశాన్ని కూడా ఉద్యమకారులు ఇచ్చారు. ఈ పరిణామంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, వ్యవస్థను ప్రశ్నించే పౌరుల శక్తికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు.

సీజేపీ దూకుడుతో స్కూల్ ఠీక్ క‌రో కేవలం సోషల్ మీడియా క్యాంపెయిన్‌గా కాకుండా, స్థానిక సమస్యలపై ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే ఉద్యమంగా మారుతోందా? అనే చర్చ మొదలైంది.

CJP ముందున్న టార్గెట్ ఏంటి?

CJP భవిష్యత్ ప్రణాళికలు చూస్తే కేవలం స్కూళ్లకే పరిమితం కావడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని పరిశీలించేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా మరో క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు, వేచి ఉండే సమయం, రోగులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇదే సమయంలో సెప్టెంబర్‌లో క్యా బోల్తీ ప‌బ్లిక్ పేరుతో దేశవ్యాప్త ప్రజా అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. విద్య, నిరుద్యోగం, పాలన వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా తెలుస్తోంది.

ఎన్నికల రాజకీయాల్లోకి CJP వస్తుందా?

ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ప్రస్తుతానికి CJP ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీగా కాకుండా ప‌బ్లిక్ ప్రెష‌ర్ గ్రూప్‌గా కొనసాగుతామని దీప్కే ఇప్ప‌టికే స్పష్టం చేశారు. అంటే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం కంటే ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బయటకు తీసుకురావడం, అధికార వ్యవస్థపై ఒత్తిడి పెంచడం CJP ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

అస్సాంలో కూడా తదుపరి రాజకీయ క్యాంపెయిన్‌కు ముందు విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని CJP ప్రకటించింది. దీన్ని బట్టి యువతను తమ కార్యకలాపాల్లో మరింతగా భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

CJPకి భవిష్యత్తు ఉందా?

CJP అసలు బలం యువత, సోషల్ మీడియా కనెక్ట్. ఒక సమస్యను గుర్తించి దానిపై ప్రజలను సమీకరించడం, ఆ సమస్యను వైరల్ చేయడం, ఆ తర్వాత అధికారులపై ఒత్తిడి తీసుకురావడం అనే మోడల్ ఇప్పటివరకు ఉద్యమానికి గుర్తింపు తెచ్చింది.

కానీ ముందున్న సవాలు కూడా అదే. ఒక్కో సమస్యపై నిరసనలు చేయడం కంటే, వాటికి శాశ్వత పరిష్కారాలు తీసుకురాగలదా? దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు సంస్థాగతంగా బలంగా నిలబడగలదా? సోషల్ మీడియా మద్దతును నిరంతర ప్రజా ఉద్యమంగా మార్చగలదా? అన్నదే కీలకం.

ప్రస్తుతం మాత్రం “స్కూల్ ఠీక్ క‌రో” నుంచి “క్యా బోల్తీ ప‌బ్లిక్” వరకు CJP తన ఉద్యమాన్ని విస్తరిస్తోంది. స్కూళ్లు, ఆసుపత్రులు, నిరుద్యోగం, విద్య, పాలన.. ప్రజల రోజువారీ సమస్యలపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లోకి రాకుండానే ప్రభుత్వాలను ప్రశ్నించే కొత్త తరహా ప్రెష‌ర్ పాలిటిక్స్ మోడల్‌గా CJP నిలబడుతుందా? అన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

#CJP#Cockroach Janata Party#School Theek Karo#CJP Movement#Abhijeet Dipke#Government Schools#Education News#Maharashtra News#Youth Movement#Public Movement#India News#Social Activism#CJP Future Plans
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి