స్నేహం అంటే బాల్యం, కౌమారం, యవ్వనంలో కలిసే బంధాలు కాదు.. కొందరి జీవితాల్లో ఈ దశలో కలిగిన పరిచయాలు కూడా బలంగా మారవచ్చు.. అయితే ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన తర్వాత స్నేహం అర్థం పూర్తిగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.. చిన్నప్పుడు ఎక్కువ మంది స్నేహితులు ఉండటం ఆనందంగా అనిపిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ పరిచయాలు పెరగడం కంటే.. మనసును అర్థం చేసుకునే మనుషులు ఉండటం ముఖ్యం అవుతుంది.
మరోవైపు 40 వయస్సుకు జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం, ఉద్యోగం, పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం.. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య కూడా మనసులో మన స్థానాన్ని మార్చుకోని కొందరు ఉంటారు. వాళ్లే నిజమైన స్నేహితులుగా పేర్కొంటారు.
అదేవిధంగా ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసే వాళ్లు ఎక్కువ ఉన్న ఈ కాలంలో వాళ్ళు నిజమైన స్నేహితులని అనిపించుకోరు. అలాగని ఇలాంటి వాళ్ళను తప్పుపట్టడానికి వీలు లేదు.. కానీ కొందరు మాత్రం ఎలాంటి అవసరం లేకుండా.. ఎలా ఉన్నావు? అంటూ ఒక్కోసారి పలకరిస్తారు. మనకు ఇబ్బంది కలుగకుండా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారి స్నేహం చాలా అరుదుగా లభిస్తుంది.
అందుకే ఈ ప్రపంచంలో నిజమైన స్నేహం ఎంత గొప్పదో వయసు పెరిగేకొద్దీ మనకు స్పష్టంగా అర్థమవుతుందని పెద్దలు చెబుతారు.. మనం ఎదుగుతున్నప్పుడు మన విజయాన్ని చూసి ఓర్వలేకపోయేవాళ్లు చాలామంది ఉంటారు, కానీ మీ ఎదుగుదలను తమ ఇంట్లో జరిగిన శుభకార్యంలా భావించే వ్యక్తి దొరికితే అతడే మీ నిజమైన స్నేహితుడు.
అతను మీ ఎదుగుదల చూసి ఎప్పుడూ కుళ్లుకోడు, పైగా గర్వపడతాడు. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందు మిమ్మల్ని వెనుకేసుకొచ్చి, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మొహమాటం లేకుండా సూటిగా నువ్వు చేసింది తప్పు, ఇంకోసారి ఇలా చేయకు అని చెప్పడానికి అస్సలు భయపడడు. ఎందుకంటే అతనికి మీ మెప్పు కంటే మీ భవిష్యత్తే ముఖ్యం.
మరోవైపు మన దగ్గర డబ్బు, హోదా ఉన్నప్పుడు పక్కన తిరిగేవాళ్లు వేలల్లో ఉంటారు. కానీ మన పరిస్థితులు బాగోలేని సమయంలో, మనం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాల్సిన రోజుల్లో కూడా తోడుగా నిలిచేవాడే అసలైన స్నేహితుడు. మీ బాధను అర్థం చేసుకోవడానికి అతనికి కారణాలు అవసరం లేదు. మీ గొంతులో వచ్చే చిన్న మార్పును, ముఖంలో కనిపించే అలసటను చూసి మీ మౌనాన్ని పసిగడతాడు. ఏమైంది? అని పదే పదే ప్రశ్నించి విసిగించకుండా.. నేను ఉన్నాను, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు వింటాను అని భరోసానిస్తాడు.
ఇక స్నేహితుల గురించి అందరి ముందర మంచిగా మాట్లాడటం సాధారణమే.. కానీ ఆ స్నేహితుడు లేని చోట ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే మన గౌరవాన్ని కాపాడే వ్యక్తి చాలా అరుదుగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఉంటే చెప్పు అని ఊరికే మాట వరుసకి అనకుండా, చెప్పకుండానే ఆసుపత్రిలోనో, ఆర్థిక ఇబ్బందుల్లోనో పక్కన వచ్చి నిలబడతాడు. నెలలు, సంవత్సరాలు మాట్లాడుకోకపోయినా మళ్లీ కలిసినప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదు? అని నిందించకుండా, నిన్ననే కలిసినట్లుగా ఆప్యాయంగా పలకరిస్తాడు.
వయసు నలభై దాటాక మనకు అర్థమయ్యే అసలు నిజం ఏంటంటే.. ఫోన్ బుక్ లో వందల సంఖ్యలో నంబర్లు ఉండటం విజయం కాదు. మనసు బాగోలేని రోజున ధైర్యంగా ఫోన్ చేసి మాట్లాడటానికి ఒక్కడున్నా చాలు. వయసు పెరిగేకొద్దీ స్నేహితుల సంఖ్య తగ్గడం నష్టం ఎంతమాత్రమూ కాదు, మనతో ఎవరు నిజంగా ఉన్నారో తెలుసుకోవడమే అసలైన జీవితానుభవం. చివరికి మన వెంట ఎంతమంది నడిచారనేది కాదు, మనకోసం ఎంతమంది ఆగారనేదే మన జీవితానికి, నిజమైన స్నేహానికి నిర్వచనం..


