* ధరణి పోయింది కానీ ధోరణి పోలేదు..
* భూభారతి కాదు ఇది భూహారతి.
* భూములు అమ్మి 10లక్షల కోట్లు సంపాదించాలని చూస్తున్నారు.
* 22 A తీసుకొచ్చి ప్రజల గోస పుచ్చుకుంటున్నారు.
* ఆర్టీఏలు వేసి భూముల విషయంలో రేవంత్ రెడ్డి రీసెర్చ్ స్కాలర్ అయ్యారు.
* ఫినిక్స్ కంపెనీ ఆగడాలు ఎక్కువయ్యాయి. వాళ్లు నిర్మిస్తున్న హానర్ హోమ్స్ అక్రమం. వాళ్లని వదిలిపెట్టేది లేదు.
* పేదల భూములు కాపాడే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది.
* కేసీఆర్ ఇచ్చిన పర్మిషన్స్ మీద రివ్యూ చేసి అవన్నీ రద్దు చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఎందుకు చేయడం లేదు?
Eatala Rajender: తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన భూ చట్టం వస్తుంది అనుకున్నామని కానీ అందుకు భిన్నంగా జరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో.. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టు అయ్యిందన్నారు. పేదలకు భూములపై హక్కులను కాలరాశారని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వాళ్ల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. రద్దు దేవుడెరుగు.. ఇప్పుడు తెచ్చిన భూభారతి పేదలను నిండా ముంచిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
''నిషేధిత భూముల జాబితా 22A ను తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ అయితే దాన్ని సమున్నతంగా అమలుచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో భూముల మీద డాక్టరేట్ చేసిన వాడు రేవంత్ రెడ్డి.. నాకు భూములపై సంపూర్ణ అవగాహన ఉంది, ఎన్నో ఆర్టీఐ యాక్ట్స్ వేసినా అని ఆయనే స్వయంగా చెప్తారు. కేసీఆర్ కాలంలో కొన్ని భూములు ల్యాండ్ పూలింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భూదందా చేసింది ఆ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకి వేసి హైడ్రా పెట్టి.. ఆ భూములకు ఫెన్సింగ్ వేసి అమ్ముకుంటున్నారు. 22A వళ్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంది మా మల్కాజ్ గిరి నియోజకవర్గం.
బడంగిపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అని గుంజుకుంటున్నారు. ఇది ఒక భూదందా, దౌర్జన్యం. దుండిగల్ సర్వే నంబర్ 452, 453లో 400 ఎకరాల భూమిని 500 మందికి ఇస్తే.. ఇప్పుడు వాటిని లాక్కుంటున్నారు. బోరంపేటలో సర్వే నంబర్ 166 లో 150 మంది రైతులు 80 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. బోరంపేటలో సర్వే నంబర్ 472 లో 30 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. వీటిని ఇప్పుడు గుంజుకుంటున్నారు.
బొమ్మరాసు పేటలో 1965 లో 1049 ఎకరాల భూమిలో 227 ఎకరాలు ఇనాం భూములకు పట్టాలు ఇచ్చారు. మిగతా భూమి ప్రైవేట్ భూమి. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ధరణి తెచ్చాక 1965 లో ఉన్న ఆయన పేరు మీద రికార్డ్స్ లో వచ్చింది. దీంతో గద్దల్లాగా బ్రోకర్స్ మీద పడ్డారు. నేను ఆందోళన చేస్తే ఆనాటి ప్రభుత్వం భయపడి ఆగింది.
ఎన్కే పల్లి : 200 ఎకరాలు, హజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ లో 60 గజాల లెక్క పేదలకు ఇచ్చిన 290 ప్లాట్లు, అంబేద్కర్ నిధి కింద మంజూరైన కోళ్ల ఫారాలు కూడా కూలగొడుతున్నారు. పెద్ద మంగళారం 200 ఎకరాలు, వెంకటేశ్వర స్వామికి దాతలు ఇచ్చిన 1200 ఎకరాల భూమిని లాక్కొని వాటిని వేలంలో అమ్మి లక్షల కోట్ల రూపాయలు జమ చేసే పనిలో పడ్డారు.
కూకట్ పల్లి ఎల్లమ్మబండ సర్వే నంబర్ 57లో 330 ఎకరాల భూమిలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 176 ఎకరాలు పేదలకు, జర్నలిస్టులకు ఇచ్చారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక దేశపాండే అనే బ్రోకర్ తో కుమ్మక్కై సుప్రీంకోర్టులో సరైన పత్రాలు సమర్పించకుండా కేసు ఓడిపోయి ఆ భూమి వాడికి పోయేలా సహకరించింది. ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. రేవంత్ వచ్చాక ఆ భూమి వెనక్కి తీసుకుంటాడని అనుకున్నాం. కానీ వారితో సెటిల్ మెంట్ చేసుకుంటున్నారు.
కూకట్ పల్లిలో ఇండియన్ డిటోనేటర్ కంపెనీ తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ గా మారింది. ఆ కంపెనీకి చెందిన 330 ఎకరాల భూమిని చెరబట్టారు. హుజూరాబాద్ లో నన్ను ఓడించడానికి వచ్చిన అక్రమ డబ్బులన్నీ ఇక్కడి నుండే వచ్చాయి. దీనికి మధ్యవర్తి వహించింది ఫినిక్స్ కంపెనీ. ఈ ఫినిక్స్ కంపెనీ ఆగడాలు ఎక్కువయ్యాయి. వాళ్లని వదిలిపెట్టేది లేదు. 20వేల కోట్ల రూపాయల విలువైన భూములని ఆక్రమించుకొని నిర్మిస్తున్న హానర్ హోమ్స్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి.
అబ్దుల్లాపూర్ మెట్ కొహెడ గ్రామంలో 70 ఏళ్ల క్రితం 246 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని లాక్కుంటున్నారు. బహదూర్ గుడాలో 650 ఎకరాల్లో గులాబీలు పండిస్తున్న భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తే కారం పట్టుకొని అడ్డుకున్న సంఘటనలు చూశాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. హైడ్రా పెట్టి పేదల గూడు చెదరగొడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. భూములు అమ్మి 10లక్షల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భూదందాల మీద ప్రజా ఉద్యమాలే కాకుండా దేశంలో అత్యన్నత విచారణ సంస్థల తలుపు కూడా తడతాం'' అని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.


