శ్రీరాముడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం!.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా... పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా... ఇచ్చిన మాటను, ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టని మహోన్నత వ్యక్తిత్వం ఆ రామయ్యది.. అందుకే శ్రీరాముడిని మర్యాదా పురుషోత్తముడిగా, ధర్మమూర్తిగా భారతీయులు ఆరాధిస్తారు.
ఇక శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి రోజునే అవతరించాడని పురాణ, సంప్రదాయ విశ్వాసం. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, మధ్యాహ్న సమయంలో కౌసల్యాదేవికి రాముడు జన్మించాడని వాల్మీకి రామాయణం వివరిస్తుంది. అయితే సీతారాముల కల్యాణం చైత్ర శుక్ల నవమినాడే జరిగిందని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పలేదు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో వారి వివాహం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడని పండితులు చెబుతారు.
అయితే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో శ్రీరామనవమి రోజునే సీతారామ కల్యాణం ఎందుకు నిర్వహిస్తారు? అనే విషయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఎంతో గొప్పదని అంటారు. శ్రీరాముడిని సీతాదేవి నుంచి విడిగా కాకుండా.. సీతారాములుగా కలిసి ఆరాధించడమే భారతీయ సంప్రదాయం. రాముడి జీవితంలో ధర్మం ఎంత ముఖ్యమో.. సీతమ్మ తల్లి సహధర్మచారిణిగా నిలిచిన త్యాగం, సహనం, పతివ్రతా ధర్మం కూడా అంతే గొప్పవి.
అందుకే రామనవమి వేడుకల్లో జన్మోత్సవంతో పాటు సీతారామ కల్యాణానికి ప్రత్యేక స్థానం ఏర్పడిందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఇక శ్రీరాముడి గొప్పతనం ఆయన చూపించిన అద్భుతాల్లో కాదు.. ఆయన జీవించిన విధానంలో ఉంది.. పట్టాభిషేకానికి సిద్ధమైన రోజే వనవాసం వచ్చింది. తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. అడవుల్లో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ప్రాణంగా ప్రేమించిన సీతమ్మ రావణుడి చేత అపహరించబడినప్పుడు... భర్తగా ఆవేదన చెందాడు, కన్నీరు పెట్టుకున్నాడు, ఆమె కోసం అడవుల్లో వెతికాడు.
అయినా ఏ సందర్భంలోనూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అలాగే లోకమంతా తనను దైవంగా భావించినా.. తాను మాత్రం అహం దశరథాత్మజః అంటూ దశరథ మహారాజు కుమారుడిగా తన ఉనికిని ప్రకటించాడు. అందుకే రాముడు కేవలం పూజించబడే దేవుడు కాదు.. జీవితంలో అనుసరించాల్సిన ఆదర్శ మూర్తిగా శాస్త్రాలు చెబుతాయి. తండ్రి మాటకు కట్టుబడటం.. సోదరులపై ప్రేమ.. భార్యపై బాధ్యత.. ప్రజల పట్ల కర్తవ్యం.. శత్రువువిషయంలో కూడా ధర్మాన్ని పాటించడం... ఇవన్నీ రామతత్వంలో కనిపించే విలువలు.
రాముడి జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే.. పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు.. కానీ మన ప్రవర్తన, మన ధర్మం మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. అందుకే దేశంలో రామరాజ్యం అంటే కేవలం ఒక రాజ్యపాలన కాదు.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, న్యాయంగా, ధర్మబద్ధంగా జీవించే సమాజానికి ప్రతీకగా చెబుతారు. ఇక శ్రీరామ రామ రామేతి..రమే రామే మనోరమే అనే రామనామ స్మరణకు భక్తి సంప్రదాయంలో విశేషమైన మహిమ ఉంది. రామనామాన్ని స్మరించడం మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
భద్రాచలం నుంచి దేశంలోని అనేక ప్రాంతాల వరకు సీతారామ కల్యాణం జరగడం అనేది.. ధర్మం, దాంపత్య పవిత్రత, త్యాగం, సత్యం, కర్తవ్యాన్ని మన జీవితాల్లో గుర్తుచేసుకునే ఆధ్యాత్మిక సందర్భం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాములను దర్శించుకోవడం అంటే.. మనలోని ధర్మాన్ని మేల్కొలపడం అని పండితులు చెబుతారు.. మరోవైపు రాముడిలో వున్న గొప్పదనం ఏంటని ఆలోచిస్తే.. ఆయన మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు.
కాని జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.. జరగరాని సంఘటనలెన్నో తన జీవితంలో జరిగాయి.. చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు.. పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు.. తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు.. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షసవధ చేశాడు.. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటుందంటే దానికి కారణం..ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు...
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


