భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కొన్ని ఆచారాలు బయటకు ఎంతో సాధారణంగా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక తరతరాలుగా ఋషులు, జ్ఞానులు, ఆధ్యాత్మిక వేత్తలు అందించిన లోతైన తాత్విక రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి పవిత్రమైన ఆచారాల్లో నమస్కారం ఒకటి. దేవుడి ముందు చేతులు జోడించి శిరస్సు వంచడం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నమస్కారం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? శరీరాన్ని వంచడమే నమస్కారమా? లేక దాని వెనుక మరింత లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనేది తెలుసుకుందాం!..
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నమస్కారం అనేది కేవలం ఒక శారీరక చర్య కాదు. అది మనిషిలోని అహంకారాన్ని కరిగించే సాధన. తనను తాను భగవంతుని చైతన్యానికి సమర్పించుకునే పవిత్రమైన ప్రక్రియ. మనిషి తన శిరస్సును వంచినప్పుడు వంగేది కేవలం శరీరం కాదు.. తనలోని నేను అనే అహంకారం. చేతులు జోడించినప్పుడు రెండు చేతులు మాత్రమే కలవకూడదు.. మనస్సు కూడా భాగ్యవంతునితో ఏకమవ్వాలి. అప్పుడే నమస్కారానికి నిజమైన అర్థం లభిస్తుందని చెబుతారు.
ఇక నమః అంటే శరణాగతి.. సమర్పణ.. అహంకార త్యాగం.. నేనే చేశాను.. నాకే అన్నీ తెలుసు.. నాదే గొప్ప అనే భావనకు బదులుగా.. నీవే కర్త.. నీవే రక్షకుడు.. నీవే నా ఆధారం.. నేను నీ శరణాగతుడను అనే భావన కలగాలి. అప్పుడే నమస్కారం ఒక శారీరక చర్య నుంచి ఆధ్యాత్మిక సాధనగా మారుతుందని పండితులు చెబుతారు. ఇక మన సంప్రదాయంలో నమస్కారం కేవలం శరీరంతోనే కాదు.. శరీరం, వాక్కు, మనస్సు అనే మూడు స్థాయిల్లో జరుగుతుంది.
అందులో మొదటిది.. కాయిక నమస్కారం.. ఈ పక్రియ శరీరంతో చేసే నమస్కారం. చేతులు జోడించడం, శిరస్సు వంచడం, సాష్టాంగం లేదా పంచాంగంగా ప్రణామం చేయడం ఇందులోకి వస్తాయి.. రెండవది.. వాచిక నమస్కారం.. నమః, నమస్కారం అని పలకడం, దేవతా నామస్మరణ, స్తోత్రపఠనం మొదలైన వాటి ద్వారా భక్తిని వ్యక్తం చేయడం. మూడవది.. మానసిక నమస్కారం.. శరీరంతో నమస్కరించే అవకాశం లేకపోయినా, మనస్సులో భగవంతుని స్మరించి భగవంతుడా! నీకు నా నమస్కారం అని భావించడం.
మరోవైపు కాయక నమస్కారంలోని నాలుగు విధానాలున్నాయి. అందులో.. అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం, త్ర్యంగ నమస్కారం, ఏకాంగ నమస్కారం.. ఇక అష్టాంగ నమస్కారం అంటే.. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా । పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥ ఈ శ్లోకంలో వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, రెండు పాదాలు, రెండు చేతులు, రెండు చెవులు మొదలగు ఈ ఎనిమిది అంగాల సమర్పణతో చేసే ప్రణామాన్ని అష్టాంగ నమస్కారం అంటారు.
కొన్ని సంప్రదాయాల్లో శరీరాన్ని నేలకు తాకించే అంగాలను శిరస్సు, వక్షస్థలం, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాలుగా వివరించి, దృష్టి–మనస్సు–వాక్కును అంతరంగ సమర్పణగా భావిస్తారు. అందువల్ల సాష్టాంగ నమస్కారం అంటే కేవలం శరీరాన్ని నేలపై ఉంచడం కాదు.. సర్వాంగ సమర్పణ భావంతో భగవంతుని శరణు పొందడం.
పంచాంగ నమస్కారం అంటే.. శిరస్సు, చేతులు, మోకాళ్లు మొదలైన ఐదు ప్రధాన అంగాల సమర్పణతో చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు. శారీరకంగా సాష్టాంగ నమస్కారం చేయలేని సందర్భాల్లో ఈ విధానాన్ని అనుసరించే ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో శరీర భంగిమ కంటే భక్తి, వినయం, శరణాగతి భావమే ముఖ్యమైనదని చెబుతారు.
మూడవది త్ర్యంగ నమస్కారం.. రెండు చేతులను జోడించి తలపై ఉంచి నమస్కరించడం త్ర్యంగ నమస్కారంగా కొన్ని ఆచార సంప్రదాయాల్లో వివరించబడుతుంది. చేతులు జోడించడం, శిరస్సు వంచడం ద్వారా మనిషిలోని భక్తి, గౌరవాన్ని వ్యక్తపరుస్తారు... నాలుగవది.. ఏకాంగ నమస్కారం.. ఇందులో కేవలం తలను మాత్రమే వంచి నమస్కరించడం ఏకాంగ నమస్కారం అంటారు..
సంపూర్ణంగా నమస్కరించడానికి అవకాశం లేని సందర్భంలో భగవంతునికి ఈ విధంగా గౌరవాన్ని వ్యక్తపరచవచ్చని పండితులు చెబుతారు. ఇక మనుస్మృతిలో గురువును గౌరవించే సందర్భంలో గురువు పాదాలను విధిగా స్పృశించి నమస్కరించే సంప్రదాయం ప్రస్తావించబడింది. కుడిచేతితో గురువు కుడిపాదాన్ని, ఎడమ చేతితో గురువు ఎడమ పాదాన్ని స్పృశించి ఆశీస్సులు అందుకోవాలని చెబుతారు.
ఇక భగవంతునికి నమస్కరిస్తూ మనస్సు ఇతర విషయాల్లో తిరుగుతూ ఉంటే నమస్కారం యాంత్రికమైన చర్యగా మారుతుంది. అందుకే కాయేన- శరీరంతో, వాచా-వాక్కుతో, మనసా-మనస్సుతో భగవంతునికి సమర్పణ భావం కలిగి ఉండాలి.. వాక్కుతో స్తుతి, మనస్సుతో ధ్యానం, శరీరంతో ప్రణామం ఇవి కలిసినప్పుడు నమస్కారం మరింత అర్థవంతమవుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
అందుకే నమస్కారం అంటే శరీరం నేలను తాకడం కాదు.. మనస్సు సత్యాన్ని తాకడం.. నమస్కారం అంటే తల వంచడం కాదు.. అహంకారాన్ని వంచడం.. నమస్కారం అంటే చేతులు జోడించడం కాదు.. జీవితాన్ని సమర్పించడం.. నేను కాదు.. నీవే.. నాది కాదు.. నీదే.. నా బలం కాదు.. నీ అనుగ్రహమే.. నీ పాదాలే నాకు శరణం.. భగవంతునికి నమస్కారం చేసే సమయంలో ఈ భావం హృదయంలో మేల్కొన్న క్షణమే అది సంపూర్ణమవుతుంది.. ఇదే నమస్కారంలోని పరమ ఆధ్యాత్మిక రహస్యం అని ఆథ్యాత్మిక వేత్తలు చెబుతారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


