తెలంగాణ

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ తీరు.. మీ కబ్జా భూములు రెగ్యులరైజ్ చేస్తే ఖబర్దార్-హరీశ్ రావు

రచన: NK•••12 నిమిషాల పఠనం

రేవంత్ రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. కొత్త సమస్యలను సృష్టిస్తోందన్నారు. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా? అని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు నిలదీశారు.

* నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి

* ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదు

* ఎలాంటి దరఖాస్తు లేకుండా, బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూములు తొలగించాలి

* జాబితాలో ప్రజల భూములు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టించారు? వాస్తవం బయట పడాలి

* నిషేధిత భూముల తొలగింపు పేరుతో మీ కబ్జా భూములు రెగ్యులరైజ్ చేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు

* పొంగులేటి చెప్పిన టోల్ ఫ్రీ పని చేయడం లేదు

* కానీ.. జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది

Harish Rao: రేవంత్ రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. కొత్త సమస్యలను సృష్టిస్తోందన్నారు. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా? అని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు నిలదీశారు. 22A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.

2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ULCని రద్దు చేసిందని, ఆ తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారి, ఏళ్లుగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారని హరీశ్ తెలిపారు. 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు. రంగారెడ్డిలో 7,500 జీఓల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6వేలకు పైగా భూములు, HMDA, HUDA భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై పట్టు సాధించేందుకే నిషేధిత భూముల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

“భూమిని అమ్మడానికి వెళ్లే వరకు అది తమదా, నిషేధిత జాబితాలో ఉందా అనే విషయం కూడా ప్రజలకు తెలియడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షలాది స్థలాలు, ఇళ్లను జాబితాలో చేర్చారు. తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ 450 గజాల ఇంటిని అమ్మాలని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత అది నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. మరుసటి రోజు అమెరికా వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు అశోక్ పరిస్థితి ఏమిటి? అమెరికా వెళ్లాలా? వద్దా? అక్కడ ఉద్యోగం చేయాలా? వద్దా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

30శాతం భూమి, డెవలప్ మెంట్ హక్కులు ఇవ్వాలని డిమాండ్

బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో వెల్లడించారని, ఆయన ఒక్కరే కాదు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఎంతోమంది జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఉన్నారని తెలిపారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30 శాతం భూమి ఇవ్వాలని, డెవలప్‌మెంట్ హక్కులు కూడా ఇవ్వాలని అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని హరీశ్ తెలిపారు. ఇది తెలంగాణలో జరుగుతున్న దారుణమైన పరిస్థితి అని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తప్పు ఏమీ లేనట్లుగా అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు.

“పెద్ద తప్పు చేసి ఇప్పుడు సారీ చెబుతున్నారు. సారీ చెబితే ప్రజల బాధలు తీరుతాయా? అసలు జాబితాలో భూములను చేర్చింది ఎవరు? చేర్చమని ఆదేశించింది ఎవరు? ఇష్టానుసారంగా జాబితాలో పెడతారా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటారా?” అని నిలదీశారు.

నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.2,600 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.

పెళ్లి సమయంలో అందాల్సిన సాయం పిల్లలు పుట్టాక

“కల్యాణలక్ష్మి ఇప్పుడు సంతానలక్ష్మిగా మారింది. పెళ్లి సమయంలో అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత వస్తోంది. కల్యాణలక్ష్మి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల తప్పు అంటున్నారు. నిషేధిత భూముల విషయంలో పొంగులేటి కూడా అధికారుల తప్పు అంటున్నారు. తప్పు మీది.. అధికారులది కాదు. తప్పు మీరు చేస్తారు.. దరఖాస్తులు మాత్రం ప్రజలు పెట్టుకోవాలా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

“నిషేధిత జాబితాలో పెట్టింది మీరే కాబట్టి.. తీసేయాల్సింది కూడా మీరే. ఎట్లా పెట్టారో.. అట్లాగే తొలగించండి. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి” అని డిమాండ్ చేశారాయన.

పని చేయని టోల్ ఫ్రీ నెంబర్

నిషేధిత భూముల జాబితాకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ కూడా సక్రమంగా పని చేయడం లేదన్నారు హరీశ్ రావు. “ఇది ఎంత దగా ప్రభుత్వం?” అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నివాసం కూడా 22A పరిధిలో ఉందంటూ వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, “సీఎం ఇంటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటే.. సారీ ముఖ్యమంత్రికి చెప్పారా పొంగులేటి?” అని ప్రశ్నించారు. నైతిక విలువలు ఉంటే నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, దీనిపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీశ్.

ఆక్రమించిన భూములను తొలగిస్తే ఊరుకోము

22A జాబితా తొలగింపులో పూర్తి పారదర్శకత ఉండాలని, నిజమైన భూ హక్కుదారుల భూములను మాత్రమే తొలగించాలని స్పష్టం చేశారు. “22A ముసుగులో ఆక్రమించిన లేదా వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్‌ఎస్ ఊరుకోదు” అని హెచ్చరించారు. “అధికారుల్లారా.. తప్పులు మంత్రులు చేస్తారు.. నెపం మాత్రం మీ మీదకు నెడతారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జాబితాలు మార్చడం సాధ్యమా? మీరు చెప్పినట్లు తప్పులు చేస్తే చివరకు మీరు ఇరుక్కుంటారు. మీరు బాధపడాల్సి వస్తుంది. ముక్కుసూటిగా పనిచేయండి. తప్పు చేయకండి.. బలికాకండి” అని అధికారులకు సూచించారు.

భూ దందా వెనుక సీఎం, మంత్రి కుట్ర..

''రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించాలి. మంత్రి చేసిన తప్పులకు సీఎం చర్యలు తీసుకోకపోతే.. ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా ఈ భూదందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయి. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. తప్పు చేసిన ఈ కాంగ్రెస్ నాయకులను చట్టపరంగా బాధ్యులను చేస్తాం. 22A నిషేధిత భూముల విషయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో మేమంతా ప్రజలకు అండగా ఉంటాం” అని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

జనతా గ్యారేజీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

“తెలంగాణ భవన్‌లోని జనతా గ్యారేజీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరికైనా సమస్య ఉంటే రండి.. మేము మీకు అండగా ఉంటాం. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు. రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుంది” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

#Harish Rao#22A Lands#Prohibite Lands#Telangana#Cm Revanth Reddy#Ponguleti Srinivas Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి