తెలంగాణ

Telangana: అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..

రచన: Venu5 నిమిషాల పఠనం

జోనల్, రీజినల్ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రిన్సిపాళ్ల సర్వీస్ రిజిస్టర్ అప్‌డేట్ నుంచి విద్యార్థుల అడ్మిషన్ల వరకు.. పని ఆధారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాలు.. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన వ్యవస్థ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన సంస్థలు ఇవి. కానీ.. ఈ వ్యవస్థలోనే అవినీతి ఆరోపణలు పాతుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?..

జోనల్, రీజినల్ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రిన్సిపాళ్ల సర్వీస్ రిజిస్టర్ అప్‌డేట్ నుంచి విద్యార్థుల అడ్మిషన్ల వరకు.. పని ఆధారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడిగిన మొత్తం ఇవ్వకపోతే అధికారిక తనిఖీలు, విజిట్స్ పేరుతో వేధింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితి కేవలం కొంతమంది ఉద్యోగులకు ఎదురయ్యే సమస్య కాదు. అవినీతి వ్యవస్థలోకి చొరబడితే.. దాని ప్రభావం చివరకు విద్యార్థుల భవిష్యత్తుపైనే పడుతుంది. ఆర్థిక స్థోమత లేని విద్యార్థి చదువుకోవాలనే ఆశతో ఉచిత విద్యను అందించే చోటుకు వెళ్ళితే అక్కడ కూడా డబ్బు డిమాండ్ చేస్తే.. విద్య అనేది హక్కు కాకుండా ఆర్థిక స్థోమతకు సంబంధించిన విషయంగా మారే ప్రమాదం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

అంటేకాకుండా అర్హత ఉన్న విద్యార్థికి అవకాశం దక్కాల్సిన చోట డబ్బు ప్రభావం పెరిగితే.. సామాజిక న్యాయం అనే లక్ష్యమే దెబ్బతింటుందని అంటున్నారు. మరోవైపు.. నిజాయితీగా పనిచేసే ప్రిన్సిపాళ్లు, ఉద్యోగులు ఒత్తిడికి గురైతే వారి పనితీరుపైనా ప్రభావం పడుతుంది. అధికారుల భయంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడితే.. సంస్థల్లో జవాబుదారీతనం తగ్గిపోతుంది. పైస్థాయిలో అవినీతికి అవకాశం ఉంటే.. కిందిస్థాయిలోనూ అదే సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉంటుంది.

అందుకే ఈ ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరి మీదైనా ఆరోపణలు ఉంటే సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికి తీయాలి. తప్పు చేసిన వారు ఎవరైనా.. వారి హోదా, పరిచయాలు, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలనే వాదన జనం నుండి వినిపిస్తుంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యా సంస్థల్లోనే అవినీతి పెరిగితే.. అది కేవలం ప్రభుత్వ ఖజానాకు నష్టం కాదు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.

అర్హతకు బదులు డబ్బు, సేవకు బదులు స్వార్థం, బాధ్యతకు బదులు బెదిరింపులు చోటు చేసుకుంటే.. వ్యవస్థ క్రమంగా తన లక్ష్యాన్ని కోల్పోతుంది. గురుకులాలు పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయాలు. అలాంటి చోట అవినీతికి చోటు ఉండకూడదు. ప్రభుత్వం పారదర్శకమైన విధానాలు, కఠినమైన పర్యవేక్షణ, ఫిర్యాదులపై వేగవంతమైన విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులు గుర్తించవలసిన అవసరం ఉందంటున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలన్నీ అవినీతి కూపంగా మారిన నేపథ్యంలో కనీసం పేదలకు అందించే విద్య విషయంలోనైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించవల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న అవినీతిని అరికట్టకుంటే రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు విద్య అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

#Telangana#Social Welfare Gurukul#corruption#principals#Students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి