అసెంబ్లీ సమావేశాలకు ఏమైంది..?
అప్పట్లో చర్చ.. ఇప్పుడు రచ్చేనా..?
జనం గోడు పట్టకపోతే ఎలా నాయకా..?
50 ఏళ్ల వర్షాకాల సమావేశాల లెక్క ఇదే!
ఒకప్పుడు వర్షం కురిసే కాలంలో అసెంబ్లీ తలుపులు తెరిస్తే.. ప్రజల సమస్యలు వరదలా సభలోకి వచ్చేవి. ఇప్పుడు వర్షాకాల సమావేశం మొదలయ్యే సరికి మరో ప్రశ్న ముందుకొస్తోంది. సభ ఎన్ని రోజులు నడుస్తుంది..? చర్చకు ఎంత సమయం మిగులుతుంది..?
27 రోజుల నుంచి 5 రోజులకు.. వర్షాకాల అసెంబ్లీకి ఏమైంది?
27 రోజులు.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీకి సగటున దక్కిన సమయం. ఇప్పుడు 5 రోజులు.. 2026 తెలంగాణ అసెంబ్లీ పరిస్థితి. మధ్యలో దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర. ప్రభుత్వాలు మారాయి.. పార్టీలు మారాయి.. రాష్ట్రం విడిపోయింది.. కానీ అసెంబ్లీ సమావేశాల తీరు మాత్రం క్రమంగా మారిపోయింది.
ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే అసెంబ్లీ తలుపులు తెరుచుకునేవి. వారాల తరబడి సమావేశాలు జరిగేవి. రైతు సమస్యల నుంచి ధరల పెరుగుదల వరకు.. సాగునీటి నుంచి విద్యుత్ వరకు.. ప్రభుత్వ విధానాల నుంచి బడ్జెట్ వరకు.. ప్రజల సమస్యలపై చర్చలు జరిగేవి.
ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
సమావేశాలు కొన్ని రోజులకే పరిమితమవుతున్నాయి. ఆ కొద్దిరోజుల్లోనే బిల్లులు, ప్రశ్నోత్తరాలు, చర్చలు, రాజకీయ ఆరోపణలు అన్నీ పూర్తి చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు సభ ప్రారంభమైన వెంటనే వాయిదాలు.. నినాదాలు.. నిరసనలు.. సస్పెన్షన్లు కూడా కనిపిస్తున్నాయి.
అయితే ఇది ఒక్క ప్రభుత్వాన్ని, ఒక్క పార్టీని తప్పుపట్టే కథ కాదు. 1980 నుంచి 2026 వరకు వర్షాకాల అసెంబ్లీ ప్రయాణాన్ని చూస్తే.. ఈ మార్పు ఎలా వచ్చింది? ప్రజా సమస్యల కోసం ఏర్పాటు చేసిన సభకు కేటాయించే సమయం ఎందుకు తగ్గుతోంది అన్నదే అసలు ప్రశ్న.
1980.. కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన ప్రయాణం
1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఆ కాలంలో శాసనసభ రాజకీయ వ్యవస్థలో కీలకమైన వేదికగా ఉండేది.
1983.. టీడీపీతో అసెంబ్లీ రాజకీయాల్లో కొత్త మలుపు
1983లో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్‌గా టీడీపీ ఎదగడంతో అసెంబ్లీ రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరిగాయి. అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య రాజకీయ పోటీ తీవ్రంగానే ఉండేది. కానీ అసెంబ్లీ అనేది కేవలం రాజకీయ నినాదాల వేదిక కాకుండా.. ప్రభుత్వ విధానాలపై చర్చించే, బిల్లులను పరిశీలించే, ప్రజా సమస్యలను ప్రస్తావించే వేదికగా కొనసాగింది.
1989.. 14 రోజుల క్యాలెండర్.. 27 బిల్లులు
1989లో సెప్టెంబర్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 19న వాయిదా పడ్డాయి. ఈ కాలంలో 27 ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాయి. వ్యవసాయ భూముల పరిమితులకు సంబంధించిన సవరణలు, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర నిధులు, ప్రొఫెషనల్ స్టడీస్ సంస్థ, సిక్ ఇండస్ట్రీస్ పర్యవేక్షణ, న్యాయ పంచాయతీలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అదనపు బడ్జెట్ అంచనాలపై కూడా చర్చ జరిగింది. ఇది అప్పటి అసెంబ్లీ పని తీరును అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ.
ప్రభుత్వం బిల్లులు తీసుకొస్తుంది.. ప్రతిపక్షం వాటిని ప్రశ్నిస్తుంది.. ఆర్థిక అంశాలు చర్చకు వస్తాయి.. ప్రజా విధానాలపై సభలో వాదోపవాదాలు జరుగుతాయి. అప్పట్లో అసెంబ్లీ తీరిది.
1990.. కాంగ్రెస్ ప్రభుత్వం.. 7 సిట్టింగ్స్
1989 చివర్లో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1990లో సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 7 సిట్టింగ్స్ నమోదయ్యాయి. తర్వాత అక్టోబర్‌లో మరో సమావేశం జరిగింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు వచ్చింది. అంటే అప్పట్లో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రంగానే ఉండేది. కానీ ఆ పోరాటం సభా ప్రక్రియలో భాగంగా అవిశ్వాస తీర్మానం, చర్చలు, ప్రశ్నల రూపంలో కనిపించేది.
1991 నుంచి 1993 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. ఈ సంవత్సరాల వర్షాకాల సమావేశాలు కూడా ఫలవంతంగానే జరిగాయి. చాలా అంశాలు చర్చకు వచ్చాయి.
1994.. ఎన్నికల ముందు కాంగ్రెస్.. తర్వాత టీడీపీ
1994లో వర్షాకాల సమావేశాలు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే ఏడాది చివర్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 1995 నుంచి టీడీపీ ప్రభుత్వం కొనసాగింది.
1995 నుంచి 1999 వరకు అసెంబ్లీ రాజకీయాలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ కాలంలో సాగాయి. ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, సంక్షేమం వంటి అంశాలు రాజకీయ చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.
2000.. సభా చర్చలకు మరో దశ
2000 నుంచి 2003 వరకు టీడీపీ ప్రభుత్వం కొనసాగింది. ఈ కాలంలో రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ రంగం, వ్యవసాయం, సాగునీరు, ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమం వంటి అంశాలు రాజకీయ చర్చల్లో కీలకంగా ఉన్నాయి.
2002.. 11 సిట్టింగ్స్.. నక్సల్స్ నుంచి సంక్షేమం వరకు
2002లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జూలై 15న ప్రారంభమై జూలై 27న ముగిశాయి. మొత్తం 11 సిట్టింగ్స్ జరిగాయి.
ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో నక్సల్స్‌తో శాంతి చర్చలు ప్రధాన అంశంగా ఉన్నాయి. ఫుడ్ ఫర్ వర్క్ పథకంలో అవకతవకలు, సామాజిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ హామీలు, మంత్రులపై విమర్శలు వంటి అంశాలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
అంటే అసెంబ్లీ చర్చలు కేవలం చట్టాలు ఆమోదించడం వరకే పరిమితం కాలేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? నిధులు ఎలా ఖర్చవుతున్నాయి? సంక్షేమ పథకాల్లో ఏం జరుగుతోంది? వంటి ప్రశ్నలు సభలోకి వచ్చాయి. వాటికి ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది.
2004.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఉచిత విద్యుత్, రైతుల సమస్యలు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, పేదల సంక్షేమం వంటి అంశాలు ప్రభుత్వ విధానాల్లో ప్రధానంగా నిలిచాయి.
2008.. 10 రోజుల సమావేశం..
2008 ఆగస్టు 25న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ 10 రోజుల సమావేశాలను నిర్ణయించింది. మరో 10 రోజులు సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే సాయంత్రం కూడా సభ కొనసాగించాలని ప్రతిపక్షం కోరింది.
ధరల పెరుగుదల, అవినీతి, ఎరువుల కొరత, విద్యుత్ సమస్యలు, రైతులు, చేతివృత్తిదారుల సమస్యలు ప్రతిపక్షం ప్రధానంగా ప్రస్తావించింది. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను తన విజయాలుగా వివరించాలనుకుంది. ఇది ఒక మంచి ప్రజాస్వామ్య దృశ్యం.
ఒకే సమస్యను ప్రభుత్వం ఒక కోణంలో చూస్తుంది. ప్రతిపక్షం మరో కోణంలో చూస్తుంది. ఆ రెండు వాదనలు సభలో వినిపిస్తేనే ప్రజలకు పూర్తి చిత్రం తెలుస్తుంది. అప్పటి సమావేశాల్లో ఈ సీన్ కనిపించేది. మరి ఇప్పుడు...? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిన విషయమే.
2009.. 27 సిట్టింగ్స్.. కీలకమైన మలుపు
ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన సంవత్సరం 2009. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభలో జూలై–ఆగస్టు కాలంలో జరిగిన సమావేశాలకు 27 సిట్టింగ్స్ నమోదయ్యాయి. ఒక్క వర్షాకాల సమావేశానికి 27 సిట్టింగ్స్ అంటే.. సభకు ఎంత సమయం కేటాయించారో అర్థం చేసుకోవచ్చు.
అదే 13వ అసెంబ్లీ కాలంలో 2009 నుంచి 2014 వరకు మొత్తం 201 సిట్టింగ్ రోజులు నమోదయ్యాయి. అంటే ఐదేళ్ల కాలానికి ఏడాదికి సగటున దాదాపు 40 రోజులు. ఇది మొత్తం వార్షిక సిట్టింగ్స్ లెక్క. వర్షాకాల సమావేశాల లెక్క కాదు. కానీ ఒకప్పుడు శాసనసభకు మొత్తంగా ఎంత సమయం కేటాయించేవారో అర్థం చేసుకోవడానికి ఇది కీలకమైన పోలిక.
2010.. 7 సిట్టింగ్స్
2009లో 27 సిట్టింగ్స్ ఉన్న తర్వాత 2010లో జూలై సమావేశాలు 7 సిట్టింగ్స్‌కే పరిమితమయ్యాయి. జూలై 7 నుంచి 15 వరకు సమావేశాలు జరిగినప్పటికీ.. అధికారిక అసెంబ్లీ హాజరు రికార్డులో 7 సిట్టింగ్స్ గా నమోదయ్యాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా గుర్తించాలి. క్యాలెండర్ రోజులు వేరు.. సభ వాస్తవంగా కూర్చున్న రోజులు వేరు.
2011.. 30 రోజుల వార్షిక సభ..
2011లో 13వ అసెంబ్లీ మొత్తం సంవత్సరంలో 30 సిట్టింగ్ రోజులు నమోదు చేసింది. 2012.. మొత్తం సభ 29 రోజులు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సంవత్సరంలో 29 సిట్టింగ్ రోజులు పనిచేసింది. సెప్టెంబర్‌లో ఐదు సిట్టింగ్స్ నమోదయ్యాయి. ఇది కూడా 2009లో నమోదైన 27 సిట్టింగ్స్‌తో పోలిస్తే భారీ తేడా.
2013.. వర్షాకాల సమావేశాలకు 10 సిట్టింగ్స్
2013లో జూన్ సమావేశాలకు 10 సిట్టింగ్స్ నమోదయ్యాయి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సంవత్సరాల్లో ఒకటి. 2013 నాటికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర విభజన డిమాండ్, రాజకీయ ఉద్రిక్తతలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల అసెంబ్లీ కూడా తీవ్ర రాజకీయ చర్చలకు వేదికగా మారింది.
2014.. ఉమ్మడి సభకు ముగింపు.. తెలంగాణకు కొత్త ఆరంభం
2014 జూన్ 2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటి వరకు 294 మంది సభ్యులతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇక్కడి నుంచి తెలంగాణ అసెంబ్లీ కథ మొదలైంది. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది.
ప్రజల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. రైతులు.. సాగునీరు.. విద్య.. ఉద్యోగాలు.. హైదరాబాద్ అభివృద్ధి. కొత్త రాష్ట్రం కాబట్టి అసెంబ్లీ చర్చలకు మరింత ప్రాధాన్యం ఉంటుందని ప్రజలు భావించారు.
2015.. దాదాపు 10 రోజుల వర్షాకాల సమావేశం
2015లో తెలంగాణ వర్షాకాల సమావేశాలు సుమారు 10 రోజుల పాటు సాగాయి. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, సాగునీరు, కరువు పరిస్థితులు ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇది తెలంగాణ కొత్త అసెంబ్లీకి ప్రజా సమస్యలు ఎంత కీలకమో చూపించింది.
అప్పట్లో ప్రశ్న సూటిగా ఉండేది. రైతు ఎందుకు చనిపోతున్నాడు? ప్రభుత్వం ఏం చేస్తోంది? నీళ్లు ఎక్కడ? సాగుకు భరోసా ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వేదిక అసెంబ్లీ.
2016.. ఒకరోజు ప్రత్యేక సమావేశం..
2016 విషయంలో ఇది విచిత్రమైన పరిస్థితి. ఆగస్టు 30న ఒకరోజు ప్రత్యేక సమావేశం జరిగింది. అది GSTకి సంబంధించిన ప్రత్యేక సమావేశం. దాన్ని సాధారణ వర్షాకాల సమావేశంగా లెక్కించడం సరికాదు.
2017.. మొత్తం ఏడాదిలో 37 సిట్టింగ్స్..
2017లో తెలంగాణ అసెంబ్లీ సంవత్సరం మొత్తంలో 37 సిట్టింగ్ రోజులు పనిచేసింది. తొలి తెలంగాణ అసెంబ్లీ కాలంలో ఇది అత్యధిక వార్షిక సిట్టింగ్ సంఖ్య. కానీ ఇదే సమయంలో ఒక పెద్ద మార్పు కూడా మొదలైంది. 2017 తర్వాత ప్రతి ఏడాది తెలంగాణ అసెంబ్లీ 20 సిట్టింగ్ రోజులకు దిగువనే ఉంది. అంటే 2017 తర్వాత అసెంబ్లీ సమావేశాల వ్యవధి క్రమంగా తగ్గుతూ వచ్చింది.
2018.. రాజకీయ మార్పు ముందు చిన్న సభా కాలం
2018లో తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల దిశగా వెళ్లింది. ఈ కారణంగా సాధారణ శాసనసభ కార్యకలాపాల క్రమం కూడా ప్రభావితమైంది.
2019.. రెండో అసెంబ్లీ.. సమావేశాల వ్యవధి తగ్గుతున్న దశ
2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2023 వరకు తెలంగాణ అసెంబ్లీ సగటున సంవత్సరానికి సుమారు 15 సిట్టింగ్ రోజులు మాత్రమే సమావేశమైంది. తొలి అసెంబ్లీ కాలంలో ఏడాదికి సగటు 26 రోజులతో పోలిస్తే ఇది దాదాపు 42 శాతం తగ్గుదల.
ఇది వర్షాకాల సమావేశాల సంఖ్య కాదు. మొత్తం వార్షిక అసెంబ్లీ సిట్టింగ్స్ సంఖ్య. అయితే ఈ గణాంకం మాత్రం ఒక పెద్ద ధోరణిని బయటపెడుతోంది. సభ సమావేశమయ్యే మొత్తం సమయం తగ్గుతోంది.
2020.. కరోనా మధ్య 17 రోజుల అసెంబ్లీ
2020లో కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా శాసనసభల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంది. ఆ ఏడాది మొత్తం 17 సిట్టింగ్ రోజులు జరిగాయి.
కరోనా వంటి అసాధారణ పరిస్థితిని సాధారణ సంవత్సరాలతో నేరుగా పోల్చడం సరికాదు. అయినా.. 2017 తర్వాత 20 రోజుల లోపే ఉన్న వార్షిక సిట్టింగ్ ధోరణిలో 2020 కూడా భాగమైంది.
2021.. సుమారు 12 రోజుల వర్షాకాల సమావేశాలు
2021లో తెలంగాణ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో సుమారు 12 రోజుల పరిధిలో జరిగాయి. కరోనా ప్రభావం, రైతు సమస్యలు, సాగు, ఉద్యోగాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు రాజకీయ చర్చల్లో ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి మరో విషయం స్పష్టమవుతోంది. సమావేశాల రోజులు తగ్గుతున్న కొద్దీ.. ప్రతి రోజుపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది.
2022.. మూడు సిట్టింగ్స్‌కే పరిమితం
2022లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. సెప్టెంబర్ 6న సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సంతాప కార్యక్రమాల అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా మూడు సిట్టింగ్స్. ఒకప్పుడు 11 సిట్టింగ్స్.. 10 రోజుల సమావేశాలు.. 27 సిట్టింగ్స్ నమోదైన ఉమ్మడి రాష్ట్ర చరిత్రను చూస్తే మూడు సిట్టింగ్స్ ఎంత తక్కువో అర్థమవుతుంది.
2023.. నాలుగు రోజులు..
2023లో తెలంగాణ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల పాటు జరిగాయి. అయితే ఈ నాలుగు రోజుల్లో సభ 26 గంటల 45 నిమిషాలు పనిచేసింది. 8 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. మరో నాలుగు బిల్లులను పునఃపరిశీలించి ఆమోదించారు. నాలుగు స్వల్పకాలిక చర్చలు జరిగాయి. 20 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు ఇచ్చారు. 38 అనుబంధ ప్రశ్నలు అడిగారు.
ఇది ఒక కీలకమైన విషయాన్ని చెబుతోంది. సభా రోజులు తక్కువగా ఉండటం మాత్రమే పనితీరును నిర్ణయించదు. ఆ రోజుల్లో ఎంత సమయం వాస్తవ చర్చకు వినియోగించారన్నదీ అంతే ముఖ్యం.
2024.. సుమారు 9 రోజుల వర్షాకాల సమావేశాలు
2024లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన సమావేశాల కాలం సుమారు 9 సిట్టింగ్స్ పరిధిలో ఉంది. కొత్త ప్రభుత్వం.. కొత్త హామీలు.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. రైతులు.. ఉద్యోగాలు.. సంక్షేమం.. ఇలా అనేక అంశాలు సభ ముందుకు వచ్చాయి. కానీ మొత్తంగా చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వ్యవధి మాత్రం గత దశాబ్దంతో పోలిస్తే తక్కువగానే ఉంది.
2025.. మూడు రోజుల వర్షాకాల సమావేశం
2025లో వర్షాకాల సమావేశాలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగాయి. అంటే కేవలం.. మూడు రోజులు. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, యూరియా కొరత, వరదలు వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. సమస్యలు పెద్దవే. రాజకీయంగా కీలకమైనవే. కానీ వాటిని చర్చించడానికి లభించిన సమయం మాత్రం మూడు రోజులే.
2026.. ఐదు రోజుల షెడ్యూల్..
ఇప్పుడు 2026 వంతు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు 5 రోజుల షెడ్యూల్‌తో కొనసాగుతున్నాయి. కాళేశ్వరం, కృష్ణా–గోదావరి జలాల పంపకం, 22-ఏ భూములు, విద్య, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వంటి అంశాలు సభ ముందున్నాయి. అంటే ప్రజా సమస్యలకు కొదవ లేదు. కానీ సమావేశాల వ్యవధి మాత్రం ఐదు రోజులు.
అదీ కాకుండా సభలో రాజకీయ ఉద్రిక్తతలు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి. నిరసనలు, నినాదాలు, వాయిదాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 9న బీఆర్‌ఎస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను మిగిలిన సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. ఐదు రోజుల సభలోనే ప్రజల సమస్యలు.. బిల్లులు.. ప్రశ్నోత్తరాలు.. చర్చలు.. రాజకీయ పోరాటం అన్నీ ఎలా పూర్తవుతాయి?
4 దశాబ్దాల లెక్క ఏం చెబుతోంది?
1989లో 27 ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందిన సభను చూశాం. 2002లో 11 సిట్టింగ్స్ చూశాం. 2008లో 10 రోజుల సమావేశం చూశాం. 2009లో ఒక్క వర్షాకాల దశలోనే 27 సిట్టింగ్స్ చూశాం. 2010లో 7 సిట్టింగ్స్ చూశాం. 2013లో 10 సిట్టింగ్స్ మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. 2015లో సుమారు 10 రోజుల తెలంగాణ వర్షాకాల సమావేశాలు చూశాం. 2022లో మూడు సిట్టింగ్స్... 2023లో నాలుగు రోజుల్లో 26 గంటల 45 నిమిషాల సభా పనిని చూశాం. 2025లో మూడు రోజులు సమావేశాలు జరిగాయి. ఇక 2026లో ఐదు రోజుల షెడ్యూల్‌ను చూస్తున్నాం. ఇది కేవలం నెంబర్ల మార్పు కాదు. శాసనసభ పని చేసే విధానంలో వచ్చిన మార్పు.
రోజులు తగ్గాయా? లేక పని పెరిగిందా?
ఇక్కడ ఒక ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం కావాలి. సభ రోజులు తగ్గాయి కాబట్టి అసెంబ్లీ పని కూడా తగ్గిందని చెప్పవచ్చా? అవసరం లేదు. 2023 ఉదాహరణ మన ముందుంది. నాలుగు రోజుల సమావేశంలోనే 26 గంటల 45 నిమిషాల పని జరిగింది. అందుకే అసెంబ్లీ పనితీరును కొలవడానికి కేవలం ఎన్ని రోజులు? అనే ప్రశ్న సరిపోదు.
ఎన్ని గంటలు? ఎన్ని ప్రశ్నలు? ఎన్ని చర్చలు?
ఎన్ని బిల్లులు? ఎంత సమయం ప్రశ్నోత్తరాలకు?
ఎంత సమయం అంతరాయాలకు? ఇవన్నీ చూడాలి.
అధికారపక్షం ఎంతసేపు మాట్లాడింది? ప్రతిపక్షానికి ఎంత సమయం?
ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. సభలో అధికారపక్షం ఎంత సమయం మాట్లాడింది? ప్రతిపక్షం ఎంత సమయం మాట్లాడింది? ఇది కూడ కీలకమే. ఉదాహరణకు తొలి తెలంగాణ అసెంబ్లీ 2014–2018 కాలంలో మొత్తం 130 రోజులు సమావేశమైంది. మొత్తం సభా సమయం 612 గంటలు. అందులో ప్రశ్నోత్తరాలకు 21 శాతం సమయం కేటాయించారు. అంటే అసెంబ్లీ సమయం అనేది కేవలం బిల్లులు పాస్ చేయడానికి మాత్రమే కాదు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలలకు మించి విరామం ఉండకూడదు. కానీ రాజ్యాంగం ప్రతి వర్షాకాల సమావేశం తప్పనిసరిగా ఎన్ని రోజులు జరగాలి అని కనీస సంఖ్యను నిర్దేశించదు. అంటే ఐదు రోజులు, పది రోజులు, ఇరవై రోజులు అనే వ్యవధి ఒకే రాజ్యాంగ నిబంధన ఉండదు. కానీ ఎక్కువ రోజులు సభను నిర్వహిస్తే ఏం జరుగుతుంది. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి. కోట్లాది మంది ఎదురుచూస్తున్న సభ.. కొంతవరకైనా ఉపయోగకరంగా సాగుతుంది. మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు. వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది కూడా మీరే కదా. అసలు రాను రాను సభా సమావేశాల సమయం ఎందుకు తగ్గుతోంది..? ఆ సమయంలోనైనా సరైన చర్చలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. అసలెందుకీ విపరీత పరిస్థితులు..?
ప్రజలకు కావాల్సింది రచ్చ కాదు.. సమాధానం ప్రజలు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపేది నినాదాలు చేయడానికి కాదు. తమ సమస్యను చెప్పడానికి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి. ప్రతిపక్షం.. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి. అవసరమైతే ప్రభుత్వం తన విధానాలను సమర్థించుకోవడానికి. ఇదే అసెంబ్లీ అసలు ఉద్దేశం.
సభలో నిరసన కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ అదే సమయంలో సభా సమయం పూర్తిగా అంతరాయాల్లోనే గడిచిపోతే.. చివరికి నష్టపోయేది ప్రజలే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అడగాల్సిన ప్రశ్న అడగలేకపోతే.. ఆ ప్రశ్నకు సమాధానం కూడా రాదు. ఒక నియోజకవర్గ సమస్య చర్చకు రాకపోతే.. దాని పరిష్కారం కూడా ఆలస్యం కావచ్చు.
27 నుంచి 5 రోజుల వరకు..
అసెంబ్లీలో అసలు మారింది ఏమిటి? 27 సిట్టింగ్స్ నుంచి ఐదు రోజుల షెడ్యూల్ వరకు వచ్చిన ఈ ప్రయాణాన్ని ఎలా చూడాలి..? పోనీ ఆ రోజుల్లోరనైనా సభ సజావుగా సాగిందా అంటే అదీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 22A ఇష్యూ ఎంత ఇబ్బంది పెడుతుందో అంతా చూస్తున్నారు. అసలు ఆ విషయంపై ఎవరూ మాట్లాడరే. తిట్టుకోవడాలు, అసెంబ్లీ ముందు తోపులాటలు, స్పీకర్‌పై దూషణలు, మాజీ సీఎం ఇంటి ముందు చావు డప్పులు. అసలు మనం ఎటు పోతున్నాం..? మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు.
1980 నుంచి 2026 వరకు రాజకీయ ప్రభుత్వాలు మారాయి. కాంగ్రెస్ వచ్చింది. టీడీపీ వచ్చింది. తెలంగాణ ఏర్పడింది. టీఆర్‌ఎస్ వచ్చింది. బీఆర్‌ఎస్‌గా మారింది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
కానీ ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న మాత్రం మారలేదు. తమ సమస్యను ఎవరు సభలో ప్రస్తావిస్తారు..? ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకప్పుడు వర్షాకాల అసెంబ్లీ 27 సిట్టింగ్స్ వరకు సాగింది. ఇప్పుడు ఐదు రోజుల షెడ్యూల్.
సమస్యలు తగ్గాయా? ప్రజల ప్రశ్నలు తగ్గాయా? ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానాలు తగ్గాయా? లేక.. ప్రజల గొంతుక వినిపించాల్సిన అసెంబ్లీ సమయమే క్రమంగా తగ్గుతోందా? ఇదే అసలు ప్రశ్న.












