టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఇషాన్, ఒకే మ్యాచ్‌లో ఏకంగా 350 పరుగులు చేసి దులీప్ ట్రోఫీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 344బంతుల్లో 270 పరుగుల విద్వాంసకర ఇన్నింగ్స్ ఆడిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లోనూ వేగంగా 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.
దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర పుటలకెక్కాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ సుమారు 39ఏళ్ల నాటి సుదీర్ఘ రికార్డును తుడిచిపెట్టేశాడు. 1987 అక్టోబర్‌లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున ఆడిన రమణ్ లాంబా ఒకే మ్యాచ్‌లో సాధించిన 320 పరుగుల రికార్డే ఇప్పటివరకు అత్యధికంగా ఉండగా, దానిని ఇషాన్ అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ డబుల్ సెంచరీ రాణించడంతో ఈస్ట్ జోన్ 708పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం సౌత్ జోన్‌ను 336 పరుగులకే ఆలౌట్ చేసి 372 పరుగుల ఆధిక్యాన్ని అందుకోగా, రెండో ఇన్నింగ్స్‌తో కలిపి ప్రస్తుతం 584 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్ టైటిల్ కైవసం చేసుకోవడం ఖాయమైంది. తన రేర్ రికార్డు ఇన్నింగ్స్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. కెరీర్‌లో క్లిష్ట సమయాలు ఎదుర్కొన్న తర్వాత అనవసర ఆలోచనలు (ఓవర్ థింకింగ్), అంచనాలకు దూరంగా ఉండటం నేర్చుకున్నానని తెలిపాడు.
భారత జట్టుకు దూరమైన రోజుల్లో ఒక ఆటగాడిగా పరుగులు సాధించడమే ప్రాథమిక కర్తవ్యమని గుర్తించానని, ప్రశాంతమైన మనస్సుతో మైదానంలో జట్టు విజయం కోసం కష్టపడటంపైనే దృష్టి సారించినట్లు చెప్పాడు. 2023లో అనూహ్య పరిణామాల వల్ల జాతీయ జట్టుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టువదలకుండా రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో (517 పరుగులు) సెంచరీలతో చెలరేగి తిరిగి జాతీయ కాంట్రాక్ట్‌తో పాటు వైట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.












