National

Kerala: ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

పినరయి విజయన్‌కు ఆయన కుమార్తె ద్వారా సుమారు రూ.3.28 కోట్ల మేర లంచం అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేరళ డీజీపీకి నివేదిక పంపి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది.

కేరళ రాజకీయాల్లో సీఎంఆర్‌ఎల్ వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి, పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే ఇదే సమయంలో, కోచిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్‌ నుంచి విజయన్ కుటుంబానికి జరిగినట్లు చెబుతున్న చెల్లింపులపై ఈడీ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

ఈడీ ఆరోపణల ప్రకారం.. సీఎంఆర్‌ఎల్ నుంచి విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలోజిక్ సంస్థకు సుమారు రూ.2.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులు నిజమైన సేవలకు సంబంధించినవి కావని, లంచం రూపంలో జరిగినవేనని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. తాజాగా పినరయి విజయన్‌కు ఆయన కుమార్తె ద్వారా సుమారు రూ.3.28 కోట్ల మేర లంచం అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేరళ డీజీపీకి నివేదిక పంపి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది.

అంతేకాదు.. వీణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో దుబాయ్‌కు హవాలా మార్గంలో నిధుల బదిలీ జరిగినట్లు కూడా ఈడీ పేర్కొంది. ఇక ఈ కేసులో కేరళ హైకోర్టు కూడా ఈడీ దర్యాప్తును కొనసాగించేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు పినరయి విజయన్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈడీ తనను, తన కుటుంబాన్ని, రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు..

ఈ క్రమంలో మీడియా కథనాలతో తన ప్రతిష్టను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు... ఈ చర్యలను రాజకీయంగానూ, చట్టపరంగానూ ఎదుర్కొంటామని పినరయి విజయన్ పేర్కొన్నారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈడీ నివేదికను న్యాయపరంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అంటే.. ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఈడీ వర్సెస్ పినరయి విజయన్ అంశంగా కాకుండా, కేరళ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త పోరుకు వేదికగా మారే పరిస్థితి కనిపిస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

#National News#ED#Kerala#Former C#M Pinarayi Vijayan#Cochin Minerals and Rutile Ltd#case
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి