ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. మనం ఆలోచించే విధానం నుంచి ఉద్యోగాలు, వైద్యం, విద్య, రక్షణ, సైబర్ సెక్యూరిటీ వరకు దాదాపు ప్రతి రంగంలోనూ AI ప్రభావం వేగంగా పెరుగుతోంది. అయితే ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నపై పెద్ద చర్చే జరుగుతోంది.
ఇలాంటి సమయంలో AI రంగంలో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మూడేళ్లపాటు AI పరిశోధనలో పనిచేసిన ఆయన.. ప్రస్తుత అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన హెచ్చరిక చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు మనుషుల నియంత్రణకు అందకుండా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే AI మనుషులను చంపేస్తుందా? అనేది మాత్రమే కాదు. AI సామర్థ్యాలు ఊహించిన దానికంటే వేగంగా పెరిగితే.. దాన్ని నియంత్రించే వ్యవస్థలు అదే స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయా? అన్న సందేహాలున్నాయి.. ఇక ప్రస్తుతం AI వ్యవస్థలు మనుషులు ఇచ్చిన సూచనల ఆధారంగా పనిచేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో మరింత స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు అభివృద్ధి చెందితే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదని అంటున్నారు..
మరోవైపు ఒక AI తన పనితీరును తానే మెరుగుపరుచుకోగలిగితే? కంప్యూటర్ సిస్టమ్‌లను గుర్తించి వాటిలోకి చొరబడే సామర్థ్యం పెరిగితే? భారీ స్థాయిలో సమాచారాన్ని విశ్లేషించి, మనుషుల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరితే? ఇది ఎంత ప్రమాదామో అనే సందేహాలు AI భద్రతపై పనిచేస్తున్న పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జాకబ్ కాక్సన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం AI అభివృద్ధి చేస్తున్న సంస్థలు మరింత శక్తివంతమైన, స్వయం మెరుగుదల సాధించే సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ పరుగులో భద్రతా ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు, మానవ పర్యవేక్షణ వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే AI వల్ల మానవాళి అంతరించిపోతుందని చెప్పే వాదనకు ప్రస్తుతం ఖచ్చితమైన శాస్త్రీయ నిర్ధారణ లేదు.
ఇవి భవిష్యత్తుపై వ్యక్తమవుతున్న ప్రమాద అంచనాలు, పరిశోధకుల అభిప్రాయాలు మాత్రమే.. ఎందుకంటే AI ప్రమాదం కేవలం మనుషులపై తిరగబడటానికే పరిమితం కాదు. తప్పుడు సమాచారం విస్తరణ, సైబర్ దాడుల సామర్థ్యం పెరగడం, కీలక మౌలిక వసతులపై దాడులు, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు, ఉద్యోగాలపై ప్రభావం, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం.. ఇలా అనేక స్థాయిల్లో ప్రమాదాలు ఉండవచ్చని జాకబ్ కాక్సన్ అభిప్రాయ పడుతున్నారు..
మరోవైపు ఇదే AI వైద్యంలో కొత్త చికిత్సలు, శాస్త్రీయ పరిశోధనలో వేగం, విద్యలో వ్యక్తిగతీకరణ, ప్రకృతి వైపరీత్యాల అంచనా వంటి అనేక రంగాల్లో మానవాళికి భారీ ప్రయోజనాలు అందించే అవకాశమూ ఉంది. అందుకే AI మీద కలిగే అపోహలను తొలగించి.. దాని నిర్ణయాలపై మానవ నియంత్రణ, పారదర్శకత, భద్రతా పరీక్షలు, బాధ్యతాయుతమైన అభివృద్ధి ఉండేలా చూడటమే ముఖ్యమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
ఇక జాకబ్ కాక్సన్ చేసిన హెచ్చరిక నిజమవుతుందా? లేక AI భవిష్యత్తుపై ఉన్న తీవ్రమైన భయాల్లో ఇదొకటిగా మిగిలిపోతుందా? దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. AI అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ, దాని భద్రతపై చర్చ కూడా అంతే లోతుగా జరగాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో AI ఎంత శక్తివంతంగా మారుతుందన్నదానికంటే.. ఆ శక్తిని ఎవరు, ఎలా, ఏ నియమాలతో నియంత్రిస్తారన్నదే మానవాళి భద్రతను నిర్ణయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..










