మన పెద్దలు భోజనాన్ని కేవలం ఆకలి తీర్చుకునే ప్రక్రియగా ఎప్పుడూ చూడలేదు. మన సంప్రదాయంలో అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం.. ఆహారం అంటే దైవ ప్రసాదం. అందుకే భోజనం చేసే విధానంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక నియమాలను మనకు అందించారు. వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. మనం తినే ప్రతి ముద్ద పట్ల కృతజ్ఞత, శ్రద్ధ, శుచిత్వం అనే భావాలను పెంపొందించడం.
భోజనానికి ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మొదటి సంస్కారం. శరీర శుచిత్వంతో పాటు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుని భోజనం ప్రారంభించాలని పెద్దలు సూచించారు. అన్నం ముందు కూర్చున్నప్పుడు క్షణమైనా భగవంతుడిని స్మరించి.. మనకు ఈ ఆహారం అందడానికి కారణమైన ప్రకృతికి, రైతుకు, వంట చేసినవారికి కృతజ్ఞత చెప్పడం ఒక గొప్ప ఆధ్యాత్మిక భావనగా చెబుతారు.
ఇక అన్నం రుచిగా లేదని నిందించడం, వండినవారిని అవమానించడం మంచిది కాదని పెద్దలు చెబుతారు.. ఎందుకంటే ఒక ముద్ద అన్నం మన ముందుకు రావడానికి భూమి, నీరు, సూర్యుడు, రైతు శ్రమతో పాటు ఎంతో మంది కృషి ఉంటుంది. అందుకే అన్నాన్ని గౌరవించాలని.. ఆహారాన్ని వృథా చేయకూడదని పేర్కొంటారు.. అదే విధంగా భోజనం చేసేటప్పుడు తింటున్న చేతితో వంట పాత్రలను తాకకూడదు.
ఇది శుభ్రతను, పరిశుభ్రతను పాటించడమే కాకుండా... తోటివారి పట్ల మనకున్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే, నిలబడి లేదా హడావిడిగా కాకుండా... ఒకచోట ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయాలని మన పెద్దలు చెప్తుంటారు. దీని వెనుక మన మనస్సు, శరీరం రెండూ ఆహారాన్ని సంపూర్ణంగా స్వీకరించాలనే గొప్ప ఆంతర్యం ఉంది. ఇక వడ్డించే సమయంలో భేదభావం చూపకూడదు. అతిథిని గౌరవంగా ఆదరించడం మన గృహస్థ ధర్మంలో గొప్ప సంస్కారం.
అలాగే వంట చేసేటప్పుడు శరీరంతో పాటు, వంట పాత్రలు, వంటగది శుభ్రంగా ఉండటంతో పాటు మంచి ఆలోచనలు, సాత్విక భావంతో వంట చేయాలని మన పెద్దలు సూచించారు. ఎందుకంటే ఆహారం కేవలం శరీరానికే కాదు.. మనసుపైనా ప్రభావం చూపుతుందనే భావన మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః.. అంటూ జీవుల దేహంలో వైశ్వానరాగ్నిగా ఉండి ఆహారాన్ని జీర్ణం చేసే పరమాత్మ తత్త్వాన్ని వివరిస్తాడు.
అందుకే మన పెద్దలు భోజనాన్ని కూడా ప్రసాదంగా చూశారు. అందుకే వండేటప్పుడు శుచిత్వం.. వడ్డించేటప్పుడు ప్రేమ.. తినేటప్పుడు కృతజ్ఞత.. తిన్న తర్వాత పరిశుభ్రత పాటించాలని చెబుతారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.











