వ్యాపారం

బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?

రచన: Kashi7 నిమిషాల పఠనం

బంగారం పెరుగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెండి పెరిగినా పెద్దగా పట్టించుకోం. కానీ బంగారం, వెండి, రాగి.. ఈ మూడు ఒకేసారి పరుగులు పెడితే..? అలాంటి స‌మ‌యంలో మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే.

బంగారం స్పీడ్.. రాగి జెట్ స్పీడ్

వెండిది కూడా అదే దారి

ప‌రుగులు పెడుతున్న లోహాలు

రాగి పెరుగుద‌ల వెనుక కార‌ణాలేంటి..?

బంగారం పెరుగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెండి పెరిగినా పెద్దగా పట్టించుకోం. కానీ బంగారం, వెండి, రాగి.. ఈ మూడు ఒకేసారి పరుగులు పెడితే..? అలాంటి స‌మ‌యంలో మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే.

ఎందుకంటే ఈ మూడు లోహాలు ఒకే కారణంతో పెరగవు. బంగారం అంటే చాలామందికి కష్టకాలంలో గుర్తొచ్చే లోహం. వెండికి కూడా పెట్టుబడి డిమాండ్ ఉంటుంది. కానీ రాగి మాత్రం మన రోజువారీ జీవితంలో కనిపించే పరిశ్రమలతో ముడిపడి ఉంటుంది. కరెంట్ వైర్లు, కార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా ఎన్నో వాటిలో రాగి అవసరం ఉంటుంది.

అందుకే ఈ మూడు లోహాల ధరలు ఒకేసారి పైకి కదలడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి కూడా ప్రస్తావించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.

బంగారం పెరిగితే ఒక అర్థం.. రాగి పెరిగితే మరో అర్థం

సాధారణంగా ప్రపంచంలో పరిస్థితులు అనిశ్చితంగా మారినప్పుడు చాలామంది బంగారం వైపు చూస్తారు. షేర్ మార్కెట్లు పడిపోతాయేమో, డబ్బు విలువ తగ్గుతుందేమో, ఆర్థిక పరిస్థితులు ఎలా మారతాయో అనే భయం పెరిగినప్పుడు బంగారంపై ఆసక్తి పెరుగుతుంది.

కానీ రాగి కథ కొంచెం భిన్నం. పరిశ్రమలు బాగా పనిచేస్తున్నప్పుడు రాగికి డిమాండ్ పెరుగుతుంది. ఇళ్లు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ పరికరాలు.. వీటి తయారీ పెరిగితే రాగి అవసరం కూడా పెరుగుతుంది.

అంటే ఒకటి భయానికి ప్రతీకలా కనిపిస్తే.. మరొకటి ఆర్థిక కార్యకలాపాలకు సంకేతంలా కనిపిస్తుంది. అలాంటి రెండు విభిన్నమైన సంకేతాలు ఒకేసారి కనిపించడం వల్లే ఇప్పుడు చర్చ మొదలైంది.

ఇదే విషయాన్ని కియోసాకి ఎందుకు ప్రస్తావించారు?

కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్టులో బంగారం, వెండి, రాగి ఒకేసారి పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించాయని గుర్తుచేశారు.

1978, 1998, 2006 సంవత్సరాల్లో ఇలాంటి ధోరణులు కనిపించాయని ఆయన చెప్పారు. ఆ తర్వాతి కాలాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.

అసలు భయం ధరల పెరుగుదలేనా?

కియోసాకి లేవనెత్తిన అసలు ప్రశ్న ఇదే. బంగారం, వెండి, రాగి ధరలు పెరగడం కేవలం ద్రవ్యోల్బణం వల్లేనా? లేక ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో భవిష్యత్తుపై నమ్మకం తగ్గుతోందా? ఇది చాలా సింపుల్‌గా చెప్పాలంటే.. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు అనే భావన పెరుగుతోందా? అన్నదే ప్రశ్న.

యుద్ధాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, దేశాల ఆర్థిక విధానాలు.. ఇవన్నీ పెట్టుబడిదారుల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో కొందరు తమ డబ్బును బంగారం, వెండి వంటి వాటిలో పెట్టాలని చూస్తారు.

కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కూడా ఆసక్తికరమే

ఇక మరో ముఖ్యమైన విషయం కూడా కియోసాకి ప్రస్తావించారు. ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఒక్కో ఏడాది 1,000 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి. అంటే సాధారణ ప్రజలే కాదు.. దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కార‌ణంగా దేశాలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయన్నది మాత్రం స్పష్టమవుతోంది.

సామాన్యుడు అల‌ర్ట్ కావాలా..?

బంగారం, వెండి, రాగి ధరలు పెరుగుతున్నాయని చూసి వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే రేపే పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరుగుతున్నప్పుడు వాటిని గమనించడం మాత్రం అవసరం. బంగారం ఏం చెబుతోంది? రాగి ఏం చెబుతోంది? పెట్టుబడిదారుల ఆలోచనల్లో ఏమైనా మార్పు వస్తుందా? అనే విషయాలను గమనించాలి.

అందుకే కియోసాకి చెప్పిన “భయపడకండి.. సిద్ధంగా ఉండండి” అనే మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బంగారం ఒక్కటే పెరగడం కొత్త విషయం కాదు. బంగారం.. వెండి.. రాగి.. మూడు కలిసి ఒకేసారి పరుగులు పెడుతున్నప్పుడు మాత్రం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైనా కొత్త కథ చెబుతోందా? అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది.

#Gold Price#Silver Price#Copper Price#Robert Kiyosaki#Gold Silver Copper#Kiyosaki Warning#Gold Investment#Silver Investment#Copper Demand#Global Economy#Inflation#Economic Crisis#Market Trends#Investment News#Financial News#Precious Metals#Commodity Prices#Gold News#Silver News#Copper News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి