సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న వారి ప్రవర్తన ఎంత ప్రమాదకరంగా మారుతోందో చెప్పే విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగుచూసింది. భోజనం చేస్తూ ఫోన్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో పదేపదే ఇంటర్నెట్ నెట్‌వర్క్ నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఉదంతం ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న డిజిటల్ అడిక్షన్, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం, మానసిక ఆరోగ్య సమస్యల తీవ్రతపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా జిల్లాకు చెందిన మంగ్లో బాయి అనే మహిళ తన నివాసంలో భోజనం చేస్తూ మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తోంది. ఆ సమయంలో సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్ పదేపదే కట్ అయి వీడియోలు ఆగిపోయాయి. దీంతో విపరీతమైన ఆవేశానికి గురైన ఆమె మొదట తన స్మార్ట్‌ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసింది. అంతటితో ఆగకుండా తీవ్ర కోపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగేసింది.
ఆవుపేడను తాగించిన భర్త..
కొంతసేపటి తర్వాత పురుగుల మందు ప్రభావంతో సదరు మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చింది. ఆమె నుంచి విపరీతమైన రసాయనాల వాసన రావడంతో గమనించిన భర్త ప్రేమ్‌లాల్, విషాన్ని బయటకు కక్కించే ప్రయత్నంలో నాటు వైద్యంగా భావించి ఆవు పేడ నీళ్లను తాగించాడు. అనంతరం పరిస్థితి మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
జిల్లా ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ, శరీరంలోకి విషం పూర్తిగా పాకడంతో సదరు మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఆసుపత్రి యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షణికావేశంలో ఒక చిన్న నెట్‌వర్క్ సమస్యకే ప్రాణాలు తీసుకునేంతటి మానసిక ఒత్తిడికి గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పోలీసులు సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.












