తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది.
రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతల ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడసేవ రోజున భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు క్యూలైన్లు, మాడ వీధుల్లో నిరంతరం అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. పుష్కరిణి మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ రక్షణ కోసం ప్రత్యేక గ్రిల్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, ఫల-పుష్ప ప్రదర్శనలతో పాటు తగిన సంఖ్యలో లడ్డూల నిల్వలను సిద్ధం చేస్తున్నారు.
ఉత్సవాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.145కోట్ల విరాళాలతో అత్యాధునిక 3D, 7D టెక్నాలజీతో పునరుద్ధరించిన 'ఎస్వీ మ్యూజియం', కాలుష్య నివారణకు రిలయన్స్ సంస్థ అందించిన '25 ఎలక్ట్రిక్ బస్సులు', ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో రూ. 12 కోట్లతో నిర్మించిన 'బయోగ్యాస్ ప్లాంట్' ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టాల విషయానికొస్తే.. సెప్టెంబర్ 8న ఆలయ శుద్ధి కార్యక్రమం ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, 15న ధ్వజారోహణంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ‘గరుడ వాహన సేవ’ సెప్టెంబర్ 19న రాత్రి వైభవంగా జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 22న రథోత్సవం, చివరి రోజైన సెప్టెంబర్ 23న పవిత్ర పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.


