ఏపీ

లోక‌ల్ ఫైట్‌కు జ‌గ‌న్ సై.. కూట‌మికి తొలి ప‌రీక్ష‌!

రచన: Kashi••6 నిమిషాల పఠనం

ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవుల కోసం జరిగే పోరు మాత్రమే కాదు. ఏపీలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో భవిష్యత్తు ఉందో చెప్పే రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంది.

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం

ఓ వైపు కూటమి.. మ‌రోవైపు వైసీపీ

ఎన్నిక‌ల‌కు సై అని ప్ర‌క‌టించిన జ‌గ‌న్

కూట‌మికి తొలి ప‌రీక్ష త‌ప్ప‌దా..?

ఏపీ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోందా? స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వైసీపీకి భారీ షాక్‌ ఇచ్చింది. అధికారాన్ని కోల్పోవడంతో పాటు అసెంబ్లీలో పార్టీ బలం కూడా కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఓటమితో పార్టీ కథ ముగిసిపోలేదని నిరూపించుకోవాలంటే.. ఇప్పుడు జగన్‌ ముందున్న అతిపెద్ద అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలే. గ్రామం, మండలం, జిల్లా నుంచి నగరం వరకు పార్టీకి ఇంకా ఎంత బలం ఉంది? కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నారు? ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై స్పందన ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు స్థానిక ఎన్నికలు సమాధానం చెప్పే అవకాశం ఉంది.

అందుకే జగన్‌ ముందుగానే క్యాడర్‌ను ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్తున్నారా? అనే చర్చ మొదలైంది. స్థానిక ఎన్నికల్లో విజ‌యం సాధిస్తే.. 2024 ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ తిరిగి పుంజుకుంటోందనే రాజకీయ సందేశాన్ని బలంగా పంపొచ్చు.

కూట‌మి ప‌రిస్థితేంటి..?

అధికార కూటమికి కూడా ఇది అంత తేలికైన పోరు కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి వచ్చిన భారీ విజయాన్ని ఇప్పుడు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచిన నేపథ్యంలో.. ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన ఎలా ఉంది? సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, ధరలు, స్థానిక సమస్యలపై ప్రజల మూడ్‌ ఏంటి? అనేది స్థానిక ఎన్నికల్లో కొంతవరకు బయటపడే అవకాశం ఉంది.

ఇక పట్టణ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల లెక్కలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. ఇక కేవలం కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవడం మాత్రమే కాదు.. ప్రజలను నేరుగా ఆకట్టుకునే బలమైన నాయకుడిని రంగంలోకి దించడం కూడా పార్టీలకు కీలకంగా మారుతుంది.

ఇక్కడే అసలు రాజకీయ గేమ్‌ మొదలవుతుంది. జగన్‌ తన పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలరా? కూటమి ప్రభుత్వం తన అసెంబ్లీ విజయాన్ని స్థానిక స్థాయిలోనూ కొనసాగించగలదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ లీడ‌రే కీల‌కం

స్థానిక ఎన్నికల్లో రాష్ట్రస్థాయి నాయకుల కంటే గ్రామస్థాయి నాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్‌, స్థానిక సమస్యలు, కుల- సామాజిక సమీకరణాలు, పార్టీ క్యాడర్‌ బలం.. ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. అందుకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను స్థానిక ఎన్నికలకు వర్తింపజేయడం కూడా రాజకీయంగా అంత సులభం కాదు.

అయితే ఒక విషయం మాత్రం ఖాయం. ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవుల కోసం జరిగే పోరు మాత్రమే కాదు. ఏపీలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో భవిష్యత్తు ఉందో చెప్పే రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంది.

జగన్‌ ముందస్తు ఎన్నికల సన్నాహాలతో క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందా? 2024లో వచ్చిన తీర్పే మళ్లీ రిపీట్‌ అవుతుందా? లేక స్థానిక సమీకరణాలు కొత్త ఫలితాలను రాస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు.. ఏపీ రాజకీయాల్లో లోకల్‌ బాడీ ఎన్నికలే ఇప్పుడు తదుపరి పెద్ద పొలిటికల్‌ వార్‌గా కనిపిస్తున్నాయి.

#AP Politics#YS Jagan#YSRCP#Andhra Pradesh Politics#AP Local Elections#TDP#Jana Sena#BJP#AP Political News#Local Body Elections#Jagan Mohan Reddy#Andhra Pradesh#Political Battle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి