తెలంగాణ రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22A) చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దలు, దళారులు బరితెగించి సాగిస్తున్న వేల కోట్ల రూపాయల దోపిడీ, 30శాతం కమీషన్ల దందాపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను కృత్రిమ వివాదాల్లోకి నెట్టి వేధింపులకు గురిచేస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్‌ఎండీఏ (HMDA) లేఅవుట్ అనుమతులు, క్లియర్ రిజిస్ట్రేషన్లు ఉన్న వేలాది ప్రైవేటు ప్లాట్లు, నివాసాలపై కావాలనే కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) ఆస్తులను కూడా ఏకపక్షంగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రెవెన్యూ శాఖలో ఏకంగా 30 శాతం కమీషన్ల రాకెట్ నడుస్తోందని, జాబితా నుంచి భూములను తొలగించాలంటే మార్కెట్ విలువలో 30 శాతం ముడుపులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోని విలువైన భూములను బ్లాక్ చేసి, అధికార పార్టీకి చెందిన బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు చేసుకోవాలని యజమానులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను ఈ జాబితాలో చేర్చిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 22ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన భూముల వివరాలపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని హరీశ్ రావు కోరారు. జిల్లాల వారీగా నిషేధిత భూముల పూర్తి వివరాలను వెంటనే పబ్లిక్ డొమైన్‌లో ఉంచి పారదర్శకత నిరూపించుకోవాలని, అవినీతి మంత్రిని కాపాడితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


