రాష్ట్రంలో మరోసారి భారీ స్కామ్ వెలుగుచూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం (పీడీఎస్ రైస్) పక్కదారి పట్టింది. మిల్లింగ్ కోసం అని ప్రభుత్వం రైస్ మిల్లర్‌కు అప్పగించగా..ప్రస్తుతం ఆ ధాన్యం కనిపించకుండా పోయినట్టు తేలింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఏఆర్ఎస్ రైలు మిల్లులో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
విషయం తెలుసుకున్న సర్కారు.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.దీంతో అధికారులు ఈ నెల 18న సదరు రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. అయితే, విజిలెన్స్ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరతను గుర్తించారు.
ఆ ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్దారించారు. అంతేకాకుండా, సదరు రైస్ మిల్లు నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ నిధులు కూడా భారీగానే బకాయి పడినట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో ఏఆర్ఎస్ రైస్ మిల్లుపై ఖానాపూర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మిల్లు నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ హస్తం ఉందని గుర్తించిన పోలీసులు.. ఆమె మీద కేసు పెట్టారు.
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కావడంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రభుత్వానికి అయిన నిధుల నష్టం, పీడీఎస్ రైస్ షార్టేజ్‌పై ఎంత మేర ప్రభావం పడనుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా,ఇటీవలి కాలంలో చాలా వరకు రైస్ మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ నిధులు భారీగా బకాయి పడ్డాయి. మరికొందరు పీడీఎస్ రైస్‌ను రాత్రికి రాత్రే మాయం చేసి తప్పుడు లెక్కలు చూపుతున్నట్టు విచారణలో తేలింది. గతంలోనూ రాష్ట్రంలోని కొందరు రైస్ మిల్లు ఓనర్లు పీడీఎస్ రైస్‌ను తీసుకుని మాయం చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం పలు మిల్లులపై బ్యాన్ విధించడంతో పాటు ఎగ్గొట్టిన డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించింది.
https://x.com/pulsenewsbreak/status/2090287714759557229?s=20
దీనికి తోడు పీడీఎస్ రైస్ పక్కదారి పట్టిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీఎంఆర్ నిధులు చెల్లించని వారి లైసెన్సులు క్యాన్సల్ చేసి వాటిని మహిళా సంఘాలకు అప్పగించాలని సీఎం.. పౌరసరఫరాల శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.కాగా, గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు అక్రమార్కులు..పీడీఎస్ రైస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటుండగా.. మరికొందరు దొంగదారిలో సర్కార్ దగ్గర నుంచి మరల అనుమతులు తెచ్చుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


