ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ ఓల్డ్ ఏజ్ మహిళా ప్యాసింజర్ గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఎయిర్ లైన్స్ సిబ్బంది మీద కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. మహిళా ప్యాసింజర్ పేషెంట్ అని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఆమె వీల్ చైర్ లాక్కున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.ఈ ఘటన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో నివాసముంటున్న సరోజ (76) అనే మహిళ గుండె, నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లింది. అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 10వ తేదీన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది.
ఆమెకు నడిచే ఓపిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు వీల్‌చైర్ బుక్ చేశారు.అయితే, ఆ వీల్‌చైర్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బంది బలవంతంగా లాక్కున్నట్టు సమాచారం. దీంతో ఎలాగోలా అతికష్టం మీద నడుస్తూ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చిన సరోజ.. ఇంటికి చేరుకోగానే గుండెపోటుకు గురైనట్టు తెలిసింది.చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా..ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
https://x.com/TeluguScribe/status/2090282594990440780?s=20
సరోజకు గుండె పోటు రావడానికి ఎయిర్ లైన్స్ సిబ్బందే కారణమని భావించిన కుటుంబసభ్యులు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థపై, జీహెచ్‌ఐఏఎల్ అధికారులపై శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదుచేశారు.ప్రస్తుతం రోగి ఆరోగ్యం విషమంగా ఉండటంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.


