స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

పని ఏదైనా.. మేఘా లూటీ ఆగలేదు?

రచన: Swechaanews Chairman••10 నిమిషాల పఠనం

మేఘా.. బాలానగర్‌లో 20 ఏండ్ల క్రితం చిన్న ఏరియాలో పేరు మాత్రమే గొప్పగా పెట్టుకున్న కంపెనీ. చిన్నప్పుడు నెల్లూరు నీళ్లు తాగిన అలవాటుతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వదిలివేసిన మెటీరియల్‌ను తక్కువకు తెచ్చుకొని వెల్డింగ్ చేసుకుంటూ కమీషన్లతో భారీగా బతికేశారు.

  • టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదా?

  • జాలిబావి చెరువు శిఖంలో ఉన్న ఆయుధాల కంపెనీని ఇప్పటికీ ముట్టుకోలేదు

  • కాళేశ్వరం ఇంజినీర్ల ఆదాయం ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చలేదు

  • కాంట్రాక్ట్ ఏదైనా లంచాలతో ఖర్చు తక్కువగా ఉండాలి.. లాభం భారీగా రావాలనేదే మేఘా ఆలోచన?

  • ఆ సొమ్ముతో రాజకీయ నాయకులను పెంచి పోషించాలనేదే ప్లాన్?

  • ప్రభుత్వం ఏదైనా, తన చంకలో ఉండేలా పైసలతోనే ప్రణాళిక చేయాలి?

  • పకృతితో ముడిపడ్డ బీజాపూర్ హైవేని కూడా వదలకపోతే ఎలా?

  • 111 జీవో భూములపై విధ్వంసం న్యాయమేనా?

  • ఎవరో చెబితే పదేండ్లుగా ఒంటరి పోరాటంలా వివిధ వేదికలపై దేవేందర్ రెడ్డి వార్తలు రాయలేదు సర్

  • మీ వ్యవస్థ ఏంటో అంతా తెలిసే రాశాను

  • పైసలు పడేస్తే అంతా మేనేజ్ అనుకునే మేఘా ఆలోచనలపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

మేఘా.. బాలానగర్‌లో 20 ఏండ్ల క్రితం చిన్న ఏరియాలో పేరు మాత్రమే గొప్పగా పెట్టుకున్న కంపెనీ. చిన్నప్పుడు నెల్లూరు నీళ్లు తాగిన అలవాటుతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వదిలివేసిన మెటీరియల్‌ను తక్కువకు తెచ్చుకొని వెల్డింగ్ చేసుకుంటూ కమీషన్లతో భారీగా బతికేశారు. అందుకు సాక్ష్యాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ చెబుతుంటారు. ప్రభుత్వ కాంట్రాక్టుల పని ఎలా చేజిక్కించుకోవాలి, ఆ తర్వాత ఏమైనా చేయ్యొచ్చు అనే భావనలో ఉంటారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్న దాని కంటే ఒక్క శాతం ఎక్కువ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారనే భావనతో పని చేశారు. 20 ఏండ్ల క్రితం రూ.8 కోట్ల పేపెంట్ ఇచ్చేందుకు నానా యాతన పడ్డ మేఘా కంపెనీ, ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో ఒకటి. రాష్ట్రంలో నమ్ముకున్న పీపీ రెడ్డిని వదిలేసినా, 5 లేదా 6 స్థానంలో అత్యంత కుబేరులుగా ఈ కంపెనీ డైరెక్టర్స్ ఉన్నారు. వీటన్నింటికీ కారణం కాంట్రాక్ట్స్‌లో ఉన్న లోప భూయిష్టతే? పెద్ద పెద్ద పేపర్లను గుప్పిట్లో పెట్టుకుని నెగెటివ్ వార్తలు రానివ్వరు. ఛానల్స్‌లో పార్ట్నర్స్‌గా ఉంటూ తెలుగు రాష్ట్రాలను శాశిస్తారు. తెలివిగా ఉండే జర్నలిస్టులను పీఆర్వోల పేర్లతో పే రోల్ ఉంటుంది. ఈ మేఘా మాయ ఒక్క కథనంలో చెప్పే స్టోరీ కాదు.

బీజాపూర్ హైవే పేరుతో పకృతి విధ్వంస కథ ఇదే?

బీజాపూర్ హైవే పనుల్లో లారీలకు, జేసీబీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేశారనే వార్తకు ఫోన్ చేస్తే ఆరా తీశాను. ఎక్కడెక్కడ పని చేశారని అడుగుతూ ఉంటే 111 జీవోలో చేసిన విధ్వంసం తెలిసింది. కనకమామిడి గ్రామంలో సర్వే నెంబర్ 51లో 111 జీవోలో ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయి. 111 జీవోలో అనుమతి లేనిదే తట్టెడు మట్టి కూడా ముట్టొద్దు. కానీ, రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఏకంగా 30 అడుగుల లోతుతో గుంతలు తీశారు. జీవో 111 నిబంధనల ప్రకారం పర్యావరణానికి హాని కలిగించే భూస్వరూపాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఎవరైనా 6 ఫీట్ల లోతు తీస్తే రెవెన్యూ వాళ్లు వచ్చి డబ్బులు డిమాండ్ చేసి తీసుకెళతారు. సిటీలో ఎగస్ట్రా ఫ్లోర్ వేసినట్లు, ఇక్కడ ఎక్కువ తవ్వితే ఇబ్బందులు.

మేఘా కంపెనీకి గుట్టైనా, గుంతైనా ఒక్కటే?

పర్యావరణ వేత్తలతో మాట్లాడితే పకృతి, పర్యావరణమే లక్ష్యంగా 111 జీవో వచ్చిందని దాన్ని కాపాడుకోవాలని అన్నారు. మొయినాబాద్ తహశీల్దార్‌ను ఈ అక్రమ తవ్వకాలపై లోకల్ పబ్లిక్ అడిగారని తెలిసింది. తమకు ఎలాంటి సమాచారం లేదని తప్పించుకున్నట్టు సమాచారం. ఈ ప్రభుత్వ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని మేఘా కంపెనీ యథేచ్ఛగా నిబంధనలను తుంగలో తొక్కి మట్టి తోడేస్తోంది.

రోడ్డుకు వాడాలంటే మట్టి నాణ్యత ఏంటో తెలుసా?

కాంట్రాక్ట్ సంస్థ తన స్వార్థ లాభాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రహదారి నిర్మాణానికి నిబంధనల ప్రకారం ఉపయోగించాల్సిన గట్టిదనమున్న నాణ్యమైన మట్టిని వేరే ప్రాంతాల నుంచైనా తెప్పించాలనే రూల్ ఉంది. అందుకు ఖర్చులు చూపిస్తారు. కానీ వీళ్లు ఎక్కువ ఖర్చు అవుతుందనే నెపంతో, రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని తవ్వేస్తున్నారు. నాణ్యత లేని మట్టిని రహదారి పనులకు ఉపయోగిస్తుండడంతో భవిష్యత్తులో ఈ రోడ్డు ఎంతకాలం తట్టుకుంటుందోనని వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే ఈ రోడ్డుపై ఆర్టీసీ బస్సు, అత్యంత ఎక్కువ లోడ్‌తో వెళ్లుతున్న కంకర లోడ్ టిప్పర్ ఢీకొని 19 మంది చనిపోయారు. మరో 20 మంది క్షతగాత్రులు అయ్యారు. అంతకుముందు పర్యావరణం పేరుతో చిన్న రోడ్డుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు న్యాణమైన మట్టి వేయకపోతే కొద్ది రోజుల్లోనే నేషనల్ హైవేకి గుంతలు పడి స్పీడ్‌తో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. మేఘా కంపెనీ ఈవేమీ పట్టించుకోవడం లేదు. రోడ్డు పునాధి గట్టిగా ఉంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. కానీ రోడ్డు పక్కనే సౌడు మట్టి దొరికిందని లోతుగా తవ్వి ఎత్తుగా మట్టి పోస్తే, ఎప్పుడైనా దెబ్బ తింటుంది. బిడ్జ్రి మధ్యలో అయితే పని కొస్తుంది కానీ, బేసిక్ రోడ్డుకు కూడా అదే నాణ్యత లేని మట్టి వాడితే అంతే సంగతులు?

మేఘాపై గత పదేండ్లుగా ఫైట్ చేస్తున్న దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అక్కడ స్వేచ్ఛగా వార్తలు రాయాలని కోరుకునేదే జర్నలిజం. ప్రభుత్వానికి కమీషన్స్ రూపంలో బ్లాక్ మనీ ఇచ్చి ఎలక్షన్స్‌కు సహకరించి భారీగా దోచుకుంటున్నారని 2014 నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాచారం సమాజానికి అందిస్తున్నాను. కొన్ని వార్తలు ఆధారాలతో వివిధ ఈ పేపర్స్‌లో, ఛానల్స్‌లో వార్తలు వస్తే, సివిల్ సూట్ వేసుకుని ఖమ్మం నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని వార్తలు నిలిపివేయించుకున్నారు. అయినా కొత్త స్కీంల్లో దూరి మన ఊరు మన బడి లాంటి కాంట్రాక్ట్స్ దొబ్బేసిన తీరు కూడా బయటపెట్టాను. ఇప్పటికీ ఆ దందాలు కొనసాగుతున్నాయి. చిన్నోళ్లను కొట్టి పెద్దగా మేఘా అయినట్లుగా శ్రీనివాస్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారు. బిజినెస్ కోసం ఏ కంపెనీతోనైనా మెర్జ్ అవుతామని, వాళ్ల అక్రమాలు కొనసాగిస్తామని చెప్పడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. నాగారం చెరువు కబ్జా చేశారని హైడ్రాకు ఫిర్యాదు రాగానే ఆపించుకున్నారు. నేను కొత్తగా ఓ ఛానల్‌లో చెప్పగానే వార్తలు రాకుండా చేసుకున్న సంఘటనలు గుర్తు చేసుకోండి కృష్ణా రెడ్డి గారు. అందుకే వెయ్యి ఏనుగులను తిన్న రాబంధు ఒక్క గాలి తుఫాన్‌కి చచ్చినట్లు, పకృతిని, ప్రజల సొమ్ముతో చేసే అతి వ్యవహారం ఎప్పటికైనా నష్టమే. ప్రతి వ్యవహారానికి ఓ లెక్క ఉంటుంది. దాన్ని పైసలతో కొనలేరు. నమ్మకాన్ని అంచనా వేయలేరు సర్.

#Megha Engineering Bijapur Highway Irregularities#GO 111 Land Violations Kanakamamidi#Sweccha News Devendar Reddy Megha Scam#Telangana Road Construction Quality Issues#National Highway Road Safety#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి