కెన్యాలో సఫారీ ప్రయాణం విషాదంగా మారింది. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక కెన్యాలోని సాంబూరు కౌంటీలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ టూరిస్టులతో వెళ్తున్న యూరోకాప్టర్ EC130 B4 హెలికాప్టర్.. మౌంట్ ఒలోలోక్వే సమీపంలోని కొండ ప్రాంతంలో కుప్ప కూలిపోయింది.
లేడీ లోరీ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్.. లోయిసాబా కన్సర్వెన్సీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్‌లో ఉన్న పైలట్‌తో పాటు మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు వారు పేర్కొన్నారు. మృతుల్లో ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్, టెలెముండో ఛానళ్ల అధ్యక్షుడు, జనరల్ మేనేజర్‌గా పనిచేసిన 55 ఏళ్ల జోస్ అల్బెర్టో సువారెజ్ కూడా ఉన్నట్టు సమాచారం.
మరోవైపు ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ మిచెల్ సెన్సీ-కంట్యూగీ, ఆయన భార్య స్టెఫానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రమాద సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. సఫారీ పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి పూర్తి కారణాలు దర్యాప్తు తర్వాత తెలనున్నట్టు వారు పేర్కొన్నారు. ఇక గతంలోనూ కెన్యాలో ఇలాంటి హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి..


