శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల ఘన విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టు, ఇప్పుడు కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుపై పూర్తి దృష్టి సారించింది. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ జట్టు కూర్పులో కీలక మార్పు చేయాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
గాలే టెస్టులో కుల్దీప్ యాదవ్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 103 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. అదే పిచ్‌పై రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి లెఫ్టార్మ్ స్పిన్నర్లు చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో కుల్దీప్ స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.
మొదటి టెస్టులో టీమిండియా ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అయితే, ప్రత్యర్థి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేయాలంటే జట్టులో ఒక నాణ్యమైన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉండటం ప్రయోజనకరమని జట్టు వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ కారణంతోనే సరాన్ష్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా కుల్దీప్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు అతనికి మరో అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా ఈ రెండో టెస్టు ప్రారంభం కానుంది.


